నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్ షోలో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
“చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఇరుకు రోడ్డులో సభ పెట్టారు. వంద అడుగుల రోడ్డును ఫ్లెక్సీలు కట్టి ముప్ఫయి అడుగుల రోడ్డుగా మార్చారు. జనం ఎక్కువగా వచ్చారని పబ్లిసిటీ పబ్లిసిటీ చేసుకునేందుకు ఇదంతా. కానీ, ఆ పబ్లిసిటీకి ఎనిమిది మంది బలయ్యారు. ఇంత జరిగినా కనీసం ఆయనలో పశ్చాత్తాపం లేదు. పైగా సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా? అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారు. పైగా పోలీసులపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలి..” అని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
మరోవైపు, కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై కందుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.