ఒక్కో ఊరికి ఒక్కో ఆచార, వ్యవహారం ఉంటుంది. మన దేశంలో అనే కాదు ఎక్కడైనా సరే.. ఆచారాలు ఉండటం అనేది కామన్. ప్రాంతాన్ని బట్టి, అక్కడి మనుషుల నమ్మకాలను బట్టి ఆచారాలు మారుతుంటాయి. అలాగే వాళ్లు కొలిచే దేవతలు, పాటించే మతాన్ని బట్టి కూడా పాటించే ఆచారాల్లో కొంత వైరుధ్యం ఉండొచ్చు. కొన్ని ఆచారాలు వినడానికి బాగున్నా.. మరికొన్ని మాత్రం వింతగా అనిపిస్తాయి. అలాంటి ఓ ఆచారమే ఇది. పౌర్ణమి నాడు ఓ ఊరు మొత్తం ఖాళీ అవుతోంది. గ్రామస్తులంతా కలసి ఆ రోజు ఊరు విడిచి చెట్ల కిందకు వెళ్తారు. చెట్ల కిందకు వెళ్లారంటే వనభోజనాలు అనుకోకండి. పౌర్ణమికి, ఆ ఊరికి ఓ ఆసక్తికరమైన సంబంధం ఉంది. అనంతపురం జిల్లా, తలారిచెరువు గ్రామస్తులు ఓ వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ప్రతి ఏటా మాఘమాసం పౌర్ణమికి ఒక రోజు ముందు ఊరు విడిచిపెట్టి, బయటకు వచ్చి ఉంటారా గ్రామస్తులు. ఈ ఆచారాన్ని ‘అగ్గిపాడు’ అని అంటారు.
కొన్నేళ్ల కింద తలారిచెరువు ఊరిలో పుట్టిన శిశువులు పుట్టినట్లే చనిపోతుండేవారు. దీంతో గ్రామ పెద్దలు కలసి ఓ బ్రాహ్మణుడ్ని కలిశారు. ఆ ఊరికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకొందని, ఊరికి కీడు ఉందని బ్రాహ్మణుడు చెప్పాడు. శిశువుల మరణానికి అదే కారణమని అన్నాడు. బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోకుండా ఉండాలంటే, దాని ప్రభావం పడొద్దంటే మాఘమాసం పౌర్ణమికి ఒక రోజు ముందు ఊరు మొత్తం ఇళ్లు విడిచి బయట ఉండాలని.. ఊరిలో ఎవరూ వంట చేయొద్దని, అప్పుడే శాంతి నెలకొంటుందని సూచించాడట. దీంతో అప్పటినుంచి గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఈ హైటెక్ యుగంలో ఇలాంటి ఆచారాలు ఏంటని కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. గ్రామస్తులు మాత్రం ఇది తమ పెద్దల నుంచి వస్తోందని, దీన్ని పాటిస్తామంటున్నారు. మరి, ఇలాంటి ఆచారాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.