చాలా మంది వెయ్యి రూపాయల దొరికితేనే మూడో కంటికి తెలియకుండా జేబులో వేసుకుంటారు. లక్షల్లో డబ్బులు దొరికితే.. ఇక అంతే సంగతులు. ఒక వేళ మీకే లక్షల్లో డబ్బులు ఉండే బ్యాగ్ దొరికితే ఏం చేస్తారు?. ఈ ప్రశ్నకు వివిధ రకాల సమాధానాలు వస్తుంటాయి. కానీ ఓ మహిళ మాత్రం నిజాయితీ చాటుకుంది. డబ్బులతో రోడ్డుపై తనకు దొరికిన బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. మహిళ నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు ఆమెను ప్రశంసించారు. అంతేకాక ఆమెను పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ అరుదైన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అంబేద్కర్ కోనసీమ జిల్లాల అంబాజీపేట మండలం మాచావరం గ్రామంలో మృదుల కుమారి అనే మహిళ నివాసం ఉంటుంది. వ్యక్తిగత పని నిమిత్తం అమలాపురం వెళ్లిన ఆమె తిరికి తన గ్రామానికి ఆటోలో బయలుదేరింది. అయితే ఆటోలో వెళ్తుండగా మార్గం మధ్యలో తన బ్యాగ్ జారిపోయింది. అది గమనించుకొని మృదుల అలానే ఇంటికి వెళ్లిపోయారు. ఆటో దిగే సమయంలో బ్యాగ్ కోసం చూడగా కనిపించలేదు. దీంతో మృదుల కంగారు పడిపోయారు. ఇంటి నుంచి తాను వచ్చిన దారిలో కాస్తా దూరం వెళ్లి చూసింది. అంతేకాక అటుగా వస్తున్న వాహనదారులను సైతం బ్యాగ్ గురించి అడిగింది. అయితే ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మృదుల పోలీసులను ఆశ్రయించింది. బ్యాగ్ పోగొట్టుకున్నట్లు, అందులో రూ.లక్ష 42 వేలు డబ్బులు ఉన్నాయని అమలాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో మృదుల ఫిర్యాదు చేసింది. మృదల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది ఇలా ఉంటే అమలాపురం గ్రామీణ మండలం బండారు లంకకు చెందిన తనూజ అనే మహిళ అదే మార్గంలో ఇంటికి వెళ్తుంది. ఈక్రమంలో ఆమెకు ఆ బ్యాగ్ కనిపించింది. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తనూజ.. తనకు ఓ బ్యాగ్ దొరికిందంటూ పోలీసులకు ఇచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందులో డబ్బులు ఎంత ఉన్నాయని వారు అడగ్గా తనకు తెలియదని, తాను చూడలేదని చెప్పినట్లు సమాచారం. ఆ మహిళ నిజాయితీకి పోలీసు అధికారులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె నిజాయితీకి మెచ్చుకున్న రూరల్ సీఐ వీరబాబు, అమలాపురం తాలూకా ఎస్సై పరదేశి ఆమెను పూల మాలతో సన్మానించారు. అనంతరం డబ్బు పోగొట్టుకున్న బాధిత మహిళను పిలిపించి.. బ్యాగును ఆమెకు అప్పగించారు పోలీసులు. తనూజ చేసిన పనికి ఆమెను గ్రామస్థులు సైతం అభినందించారు. తన డబ్బులు తిరిగి అందించిన తనూజకు మృదుల కృతజ్ఞతలు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.