నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదవశాత్తూ ఏడుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి ఆసుపత్రికి వెళ్లారు.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో బుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కార్యకర్తలు పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్ లేట్ కెనాల్ లో పడిపోయారు. వెంటనే వారిని కాల్వ నుంచి బటయకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి ఆసుపత్రికి వెళ్లారు. గాయపడిన వారిని పరామర్శిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు చంద్రబాబు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.