విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం..ప్రస్తుతం హాట్ టాపిక్. వర్సిటీపేరు మార్చే బిల్లుకు బుధవారం, ఏపీ అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. అయితే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష పార్టీల్లోని నేతలు, ఎన్టీఆర్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. తెదేపా.. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తోంది. ఇలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇందులో తారక్.. ఎన్టీఆర్ తోపాటు వైఎస్ఆర్ గురించి కూడా ప్రస్తావించారు.
‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారిస్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు’ అని తారక్, తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ని కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు తెదేపా పార్టీ శ్రేణులు కూడా నిరసనలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉండగా 1986లో ఎన్టీఆర్, మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారు. నందమూరి తారకరామారావు 1996 లో మరణించారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారు. మరి హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: హెల్త్ యూనివర్సిటీ ప్రస్థానంలో NTR పాత్ర ఎంత? అసలు నిజాలు!