ప్రభుత్వం ఉద్యోగం సాధించడమనేది ఎందరో నిరుద్యోగులు ఆశయం. ఈ లక్ష్యం కోసం రేయిబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక సర్కారు నుంచి ఏదైన జాబ్ నోటిఫికేషన్ వచ్చింది.. అంటే నిరుద్యోగ యువతకు పండగే. అయితే తాజాగా దీపావళి వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు దీపావళి కానుకును అందించారు ఏపీ సీఎం. పోలీస్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్.
నిరుద్యోగులకు దీపావళి పండగవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. 6,511 పోలీస్ నియామకాలకు పచ్చజెండా ఊపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తకీ పాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఇక పోస్టు వివరాల విషయానికి వస్తే..రిజర్వ్ విభాగంలో ఎస్సై పోస్టులు-96, సివిల్ విభాగంలో ఎస్సై పోస్టులు-315, ఏపీ స్పెషల్ పోలీస్ విభాగంలో కానిస్టేపబుల్ పోస్టులకు-2520, సివిల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-3580. అలా త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6511 పోలీస్ నియామకాలు జరగనున్నాయి.