చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని మరోసారి రుజువైంది. ఏపిలో ఎవరూ ఊహించిన విధంగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అంతే కాదు జైలు శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది. భూ పరిహారం చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్ అధికారులపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ఏకంగా జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది.
నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే వ్యక్తికి నష్టపరిహారం చెల్లించకపోవటంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు ఆదేశించినప్పటికీ సాయి బ్రహ్మ కు న్యాయం చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు నెల రోజుల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిరావు కు 2 వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఐఏఎస్ అధికారి రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా, ముత్యాల రాజు కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా, ఏఎంబీ ఇంతియాజ్ కు రెండు వారాల జైలు శిక్ష, జరిమానా విధించింది. శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించిన హైకోర్టు నెల రోజులు గడువిచ్చింది. అప్పటి వరకు జైలు శిక్షను సస్పెండ్ లో ఉంచాలని ఆదేశించింది. అంతే కాదు అధికారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పిటిషనర్‌కు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. పరిహారాల విషయాల్లో కోర్టు ఆదేశించినా కూడా చెల్లింపుల్లో జాప్యం జరగడం అనేది కొత్త విషయం కాకపోయినా.. అలాంటి కేసుల్లో నిర్లక్ష్యం వహించిన ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. తాజా హైకోర్టు తీర్పు ఏపీలో సంచలంగా మారింది. అలాంటి అధికారులపై పలు సందర్భాల్లో సీరియస్ అయింది. జైలు శిక్ష విధిస్తామని చాలా సందర్బాల్లో అధికారులను హెచ్చిరించింది కోర్టు. ఓ వైపు ప్రభుత్వం.. అధికారుల తీరుపై పలుసార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా తీరు మార్చుకోకపోవడంతో ఈసారి కేవలం హెచ్చరికలతో సరిపెట్టుకుండా.. నేరుగా శిక్షలు వేసింది.