దేశ వ్యాప్తంగా ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకు వస్తున్నాయి. వాహనదారుల తప్పిదాల వల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు కొత్త రూపంలో రాబోతున్నాయి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డ్రైవింగ్ లైనెస్స్ తో పాటు, వాహనం రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఆర్సీ ఇక నుంచి ప్లాస్టీక్ కార్డులు ఇవ్వనున్నారు. వివరాల్లోకి వెళితే..
వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ స్మార్ట్ కార్డులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి క్యూ ఆర్ కోడ్ తో పీవీసీ కార్డులు జారీ చేయనున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లోనూ సుమారుగా మూడు లక్షల డ్రైవింగ్, ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. అయితే ఆ స్మార్ట్ కార్డులో ఉండే చిప్ లో ఆయా వ్యక్తులకు సంబంధించిన విషయాలు రీడ్ చేసే యంత్రాలు రవాణాశాఖ అధికారుల వద్ద కానీ, పోలీసుల వద్ద కానీ లేక పోవడం వల్ల కొన్నిసమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. అలాగే గుత్తేదారులకు కొంత కాలంగా కోట్ల రూపాయల్లో బకాయిలు చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో స్మార్ట్ కార్డులు సరఫరా చేయడం నిలిచిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏపిలో అన్ని జిల్లాల్లో వేలాది కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి.
గత ఏడాది కాలంగా రవాణా శాఖ కమీషనర్ గా కొన్ని నెలలుగా పనిచేసిన కాటమనేని భాస్కర్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పట్నం, విజయవాడలో ప్లాస్టీక్ కార్డులు ప్రయోగాత్మకంగా వీటిని సరఫరా చేశారు. ఈ క్రమంలో మిగిలిన అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి ప్రద్యూమ్న ప్రత్యేకంగా సమీక్షించి ప్లాస్టిక్ కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.