ప్రభుత్వ ఉద్యోగం అంటే యువతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదవిన చదువుకు తగ్గది కాకపోయినా.. జీతం తక్కువైనా సరే.. ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరు వదులుకోరు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, అవుట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు కలిపి సుమారు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించారు. అయితే తొలుత రెండేళ్లు.. కాంట్రాక్ట్ బేస్డ్, తక్కువ జీతం అని తెలిసినా సరే.. చాలా మంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద చదువులు, సాఫ్ట్ వేరు కొలువును సైతం వదులుకుని.. సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని ఉద్యోగాలకు సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం రెండేళ్లకు ప్రొబేషన్ ఖరారు చేసి వారిని పర్మినెంట్ ఉద్యోగాల్లోకి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఈ ఏడాది జూన్ లో చేస్తామని హామీ ఇచ్చారు.
మరో నాలుగు నెలల్లో వీరందరిని పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా సచివాలయ ఉద్యోగులే కనిపిస్తున్నారు. వారికే డ్యూటీలు వేస్తున్నారు. వారి డ్యూటీ చార్ట్ వేరు కానీ..దాన్ని పట్టించుకోవడం లేదు. ఎంత దారుణం అయిపోయిందంటే చివరికి మరుగుదొడ్ల దగ్గర డబ్బుల కలెక్షన్లకు కూడా నియమించారు. అందులో మహిళా వార్డు కార్యదర్శులు ఉండటం మరింత దారుణం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
‘‘గుంటూరు కార్పొరేషన్ పరిధిలో గాంధీపార్కు, బండ్లబజారు, కృష్ణా పిక్చర్ ప్యాలెస్, ఎన్‌టీఆర్ బస్టాండ్, కొల్లి శారద కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఐదు మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు గడువు ఫిబ్రవరి 27తో ముగిసిపోయింది. కాబట్టి… ఫిబ్రవరి 28 నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ కింద తెలిపిన సిబ్బంది(అడ్మిన్ కార్యదర్శులు) మరుగుదొడ్ల వద్ద విధులు నిర్వహించాలి. మరుగుదొడ్లను వాడుకునే వారి నుంచి 2021-22 గజిట్ నందు ఉదహరించిన రేట్ల ప్రకారం కాలమ్ నెంబర్ 5లో చూపిన(రోజువారీ కలెక్షన్) మొత్తానికి తగ్గకుండా వసూలు చేసి అదే రోజు సాయంత్రం సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు డబ్బులు అందజేయాల్సిందిగా ఆదేశించడమైనది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఈ రుసుమును మరుసటి పని దినములో క్యాష్ కౌంటర్‌లో జమ చేయాలి!’’ అంటూ ఏ మరుగుదొడ్డి వద్ద ఎవరికి డ్యూటీ వేసిందీ వివరాలు పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తోందని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సి వస్తుందనే సాకుతో ఇలా అవమానించి వెళ్లిపోయేలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సొంత జిల్లాలో ప్రభుత్వం ఉద్యోగం అని భావించి.. పెద్ద పెద్ద చదువులు వదులుకుని మరి సచివాలయ ఉద్యోగాల్లో చేరిన వారి చేత ఇలాంటి పనులు చేయించడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై, గుంటూరు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారో లేదో కానీ ఈ లోపు వారిని మానసికంగా వేధించి ఉద్యోగం వదిలి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.