లోన్ యాప్స్.. గత కొంతకాలంగా ఈ పేరు సోషల్ మీడియా, మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇచ్చిన మొత్తానికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు వేస్తూ పీల్చి పిప్పి చేస్తున్నారు. కట్టలేమంటే బంధువులు, మిత్రులకు వారి వివరాలను పంపుతూ పరువు బజారుకీడుస్తున్నారు. వీరి ఆగడాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ వేధింపుల సెగ మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం తాకింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు లోన్ రికవరీ ఏజెంట్ అంటూ ఫోన్ వచ్చింది. ఎవరో అశోక్ మీరు తన బావ అంటూ నంబరు ఇచ్చారు. లోన్ కట్టండి అంటూ పదే పదే కాల్ చేశారు. ఆయనెవరో నాకు తెలియదు.. నేను మాజీ మంత్రని అని చెబుతున్నా కడతారా కట్టరా అంటూ గద్దించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎమ్మెల్యేకే లోన్ యాప్ వేధింపులు తప్పలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.