దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టే ఆటగాడు ప్రస్తుత క్రికెటర్లలో ఎవరన్నా ఉన్నారా అంటే.. క్రికెట్ అభిమానుల నోట వినిపించే ఒకే ఒక పేరు విరాట్ కోహ్లీ. సచిన్ వారసుడిగా పేరుతెచ్చుకున్న కోహ్లీ.. దశాబ్దకాలం పాటు అదే విధంగా బ్యాటింగ్ చేస్తూ.. రన్ మెషిన్‌గా బిరుదు తెచ్చుకున్నాడు. టెక్నిక్ ప్లస్ టాలెంట్ ఉన్న క్రికెటర్ కోహ్లీ. ప్రపంచ మేటి బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ.. పరుగుల వరద పారిస్తాడు. 2009లో మొదలు పెట్టిన 100 సెంచరీల వేటను 2019 వరకు అప్రతిహాతంగా కొనసాగించాడు.
కానీ.. 2019 తర్వాత ఏమైందో తెలియదు కానీ కోహ్లీ భారీ స్కోర్ చేయలేదు. రెండేళ్లుగా హెల్మెట్, బ్యాట్‌ను ఎత్తడమే మానేశాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఏకంగా రెండేళ్లు గడిచిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2008లో అడుగుపెట్టిన కోహ్లీ తొలి ఏడాది 5 మ్యాచ్‌లో ఆడడంతో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇక 2009లో కెరీర్‌లోనే తొలి సెంచరీ చేసి తన శతకాల ఖాతాను తెరిచాడు కోహ్లీ. ఆ ఏడాది మొత్తంలో కోహ్లీ సాధించిన సెంచరీ కూడా అదొక్కటే. ఆ తర్వాతి ఏడాది నుంచి క్రమక్రమంగా తన సెంచరీల సంఖ్యను పెంచుకుంటూ వచ్చిన కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 2010లో 3, 2011లో 4, 2012లో 8, 2013లో 6, 2014లో 8, 2015లో 4, 2016లో 7 సెంచరీలు బాదాడు. ఇక తన కెరీర్‌లోనే 2017, 2018లో అత్యధిక సెంచరీలు బాదాడు. ఈ రెండు సంవత్సరాల్లోనే అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 11 సెంచరీల చొప్పున, 22 సెంచరీలు కొట్టేశాడు. 2019లోనూ 7 సెంచరీలతో సత్తా చాటాడు. ఇలా వరుసగా 11 ఏళ్లు విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 70 సెంచరీలు కొట్టేశాడు. మరొక సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన చేరుతాడు. అదే రెండు సెంచరీలు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు.
2020, 2021 ఏడాదుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2020లో అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 24 ఇన్నింగ్స్‌ల్లో 36 సగటుతో 842 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు 89. 2021లో 24 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 30 ఇన్నింగ్స్‌ల్లో 37 సగటుతో 964 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు 80*. దీంతో కోహ్లీ తన కెరీర్‌లోనే ప్రస్తుతం అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నాడని చెప్పుకోవాలి. మరి కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొడతాడా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పదిలో నాలుగు కోహ్లీ పేరిటే! ఈ దశాబ్ధానికే కింగ్