క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మరో 10 రోజుల్లో(మార్చి 26) ప్రారంభం కానుంది. పేరుకు మాత్రం భారత్ వేదికగానే జరుపుతున్నా.. కరోనా కారణంగా లీగ్‌ను ముంబై, పుణేలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ మైదానాల్లోనే లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు.
ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఈ ధనా ధన్ లీగ్ అభిమానులను అలరించనుంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మొత్తం సంఖ్య పదికి చేరి మ్యాచ్‌ల సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే.. కరోనా దృష్ట్యా మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతివ్వనున్నారు. తొలుత ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లో నిర్వహించాలని భావించినా.. ప్రస్తుతం భారత్‌లో కరోనా పరిస్థితులు అదుపులో ఉండటంతో 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ తో సీజన్ ప్రారంభంకానుంది.దాదాపు రెండేళ తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తుండటం.. అందులోనూ 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించడంతో టికెట్లకు భారీ డిమాండ్ ఉండనుంది. త్వరలోనే ఐపీఎల్ అఫిషియల్ వెబ్‌సైట్ www.iplt20.comలో టికెట్లను అందుబాటులోకి రానున్నాయి.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..?
స్టెప్ 1: అఫిషియల్ వెబ్‌సైట్ www.iplt20.comలోకి వెళ్లాలి.
స్టెప్ 2: మెనూ బార్‌లోని బై టికెట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
స్టెప్ 3: కావాల్సిన మ్యాచ్ టికెట్లను ఎంచుకొని కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.
స్టెప్ 4: ఎన్ని టికెట్లు కావాలో వాటికి తగ్గ ధరను ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లోనే చెల్లించాలి.
స్టెప్ 5: పేమెంట్ పూర్తయిన తర్వాత టికెట్స్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 6: ఆ డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌కు సబంధించిన స్క్రీన్ షాట్ లేదా ప్రింటౌట్‌ను మ్యాచ్‌కు తీసుకెళ్లాలి.
మ్యాచ్‌లకు వెళ్లాలంటే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వాక్సినేషన్ సర్టిఫికెట్ ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం ఉత్తమం.