అరుళ్ శరవణన్.. ది లెజెండ్ శరవణ స్టోర్స్ ద్వారా ఒక గొప్ప వ్యాపారవేత్తగా గుర్తంపు సాధించారు. తమ వ్యాపారానికి సంబంధించిన కమర్షియల్స్ లో నటించడంతో నటనపై తనకున్న మక్కువను చెప్పకనే చెప్పారు. అయితే పూర్తిస్థాయి హీరోగా చేయాలనే తన కలను ‘ది లెజెండ్’ సినిమాతో నెరవేర్చుకున్నారు. హీరో కావడానికి వయసుతో సంబంధం లేదంటున్న అరుళ్ శరవణన్ నటించిన ది లెజెండ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.
హీరో అరుళ్ శరవణన్(డాక్టర్ శరవణన్) ఈ సినిమాలో ప్రఖ్యాత శాస్త్రవేత్త పాత్ర పోషించారు. తన పరిశోధనలతో తన ప్రజలకు, దేశానికి సేవ చేయాలనేదే అతని లక్ష్యం. అయితే తన ఆప్త మిత్రుడు డయాబెటిస్ తో ప్రాణాలు కోల్పోతాడు. నయంకాని ఆ షుగర్ వ్యాధికి మందు కనిపెట్టడమే శరవణన్ లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అది నచ్చని వీజే(సుమన్), డ్రగ్ మాఫియా వాళ్లు శరవణన్‌ను ఎలా ఇబ్బంది పెట్టారు? అతని లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అనేది వెండితెరపై చూడాల్సిందే.
దర్శకులు జేడీ- జెర్రీ ఎంతో సాధారణమైన కథను అదికూడా పాత కథను కొత్తగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సినిమాతో మీకు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘శివాజీ- ది బాస్’ సినిమాని గుర్తు చేశారు. అంతేకాకుండా స్టోరీ లైన్ కూడా చాలా పాతది కావడంతో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహానికి గురవుతారు. నెక్ట్స్ ఏం జరగబోతోంది అనేది మీకు ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. హీరోగా అరుళ్ శరవణన్ కొన్నిసార్లు పర్వాలేదని పించినా.. కొన్నిసార్లు మాత్రం అసలు ఆయనేనా అనే అనుమానం రాకమానదు.
పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన పాటలు, డాన్సులు, ఫైట్‌లతో బాగా గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ సినిమాలో కాస్ట్ లిస్ట్ కూడా ఎంతో పెద్దగానే ఉంటుంది. విలన్, హీరోయిన్ దగ్గర నుంచి కమేడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అంతా బాగా పేరున్న వారినే తీసుకున్నారు. కానీ, సినిమా మొత్తం హీరో వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. గీతిక, ఊర్వశీ రౌతేలా వారి పాత్ర పరిధి వరకు నటించారు. సుమన్ కు విలన్ గా మంచి స్కోప్ ఉన్నా గెటప్ మాత్రం నప్పలేదు. శివాజీలో రజనీ కాంత్ కు మామగా నటించిన వివేక్.. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే చేశారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ఇదే.
ఒక మంచి కమర్షియల్ సినిమా కోసం కమర్షియల్ గా ఎక్కడా వెనుకాడలేదు. నిర్మాణంలో ఎక్కడా లెజెండ్ శరవణన్ వెనక్కి తగ్గలేదు. హారిస్ జయరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. వి.వేల్‌రాజ్ కెమెరా వర్క్ ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేస్తుంది. రూబెన్ ఎడిటింగ్ కూడా గొప్పగానే ఉంటుంది. అరుళ్ శరవణన్ పెట్టిన రూ.80 కోట్ల భారీ బడ్జెట్ మీకు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
: 1.5/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!