కింగ్ నాగార్జున ఈ ఏడాది మూడోసారి ప్రేక్షకుల్ని పలకరించేశాడు. సంక్రాంతికి ‘బంగార్రాజు’గా హిట్ కొట్టిన నాగ్.. ఈ మధ్య పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక తనకు ఎంతో అచ్చొచ్చిన అక్టోబరు 5వ తేదీన ‘ద ఘోస్ట్’ చిత్రంతో థియేటర్స్ లోకి వచ్చేశాడు. తన కెరీర్ ని టర్న్ చేసి, టాలీవుడ్ చరిత్రనే మార్చేసిన ‘శివ’ సినిమా థియేటర్లలో విడుదలైంది ఈ రోజే. మరి నాగ్ ‘ఘోస్ట్’గా కనిపించి హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
దుబాయిలో ఉండే ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్(నాగార్జున). మరో ఆఫీసర్ ప్రియ(సోనాల్ చౌహాన్) తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటాడు. సినిమా స్టార్టింగ్ లోనే వీరిద్దరూ కలిసి ఈస్ట్ అరేబియాలో ఓ మిషన్ సక్సెస్ చేస్తారు. ఇక ఆ తర్వాత కొన్నిరోజులకు భారతీయ ఫ్యామిలీకి చెందిన ఓ పిల్లాడిని దుండగులు కిడ్నాప్ చేస్తారు. నాగ్ కాపాడే క్రమంలో ఆ పిల్లాడిని దుండగులు చంపేస్తారు. దీంతో మానసికంగా డిస్ట్రబ్ అయిన విక్రమ్ ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. విక్రమ్ తన మాట వినడం లేదనే కోపంతో ప్రియ అతడిని విడిచి పెట్టి, ముంబయిలోని NCBలో చేరుతుంది. అలా ఐదేళ్లు గడిచిపోతాయి. ఆ తర్వాత ఓరోజు ఊటీలో ఉన్న అనుపమ(గుల్ పనాగ్) నుంచి విక్రమ్ కి ఫోన్ వస్తుంది. తన లైఫ్ రిస్క్ లో ఉందని, తన కూతుర్ని చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని చెబుతుంది. దీంతో విక్రమ్ లో ఊటీలో అడుగుపెడతాడు. ఇంతకీ అను-విక్రమ్ మధ్య సంబంధం ఏంటి? అసలు అనుతో పాటు ఆమె కూతురు అతిదిని దుండగులు ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారు? అసలు ఈ కథలో ఘోస్ట్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మాత్రం మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ట్రైలర్ లో చూపించినట్లే ఈ సినిమా పక్కా యాక్షన్ డ్రామా. హీరో నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు చెప్పినట్లే ఫుల్ ఆన్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు. సినిమా ప్రారంభమే ఓ క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. ఆ తర్వాత నాగ్-సోనాల్ మధ్య దుబాయి అందాలు చూపిస్తూ అద్భుతమైన రొమాంటిక్ సాంగ్. నాగ్ ని మన్మథుడు అని ఊరికే అనరు. ఈ పాట విజువల్ గా చూస్తే ఈ విషయం మీరే ఒప్పేసుకుంటారు. ఎందుకంటే కొడుకులు హీరోలుగా చేస్తున్నా సరే నాగ్ క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. ఇందులోనూ రొమాన్స్, లిప్ లాక్ తో కేక పుట్టించారు. ఇక నాగ్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. గతంలో చేసిన ‘ఆఫీసర్’, ‘వైల్డ్ డాగ్’ సినిమాల్లోనూ ఈ తరహా రోల్సే చేశాడు. కాకపోతే వాటికి దీనికి కాస్త తేడా. ఇందులో అదిరిపోయే యాక్షన్ తో పాటు రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి.
నిజం చెప్పాలంటే దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి ఇదేం కొత్త సబ్జెక్ట్ కాదు. గతంలో తీసిన పీఎస్ ‘గరుడవేగ’లో యాక్షన్, ’11th అవర్’ వెబ్ సిరీస్ లోని కార్పోరేట్ క్రైమ్ ని మిక్స్ చేసి.. ‘ద ఘోస్ట్’ మూవీ తీసినట్లు అనిపిస్తుంది. నాగ్ అంటే రొమాన్స్ తో పాటు మాస్ అంశాలు కూడా అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తారు. అందుకు తగ్గట్లే ఇందులో దాదాపు 12 యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. కాకపోతే ఫస్టాప్ డ్రామాతో బోరింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అనిపించింది. ఇక సెకండాఫ్ మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఫైట్స్ తో నింపేశారు. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంది.
విక్రమ్ క్యారెక్టర్ లో నాగ్ ఫెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. గన్ షూట్, కత్తి ఫైట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్ అటు గ్లామర్, ఇటు రెండు సీక్వెన్సుల్లో యాక్షన్ తో ఆకట్టుకుంది. అను పాత్రలో హిందీ నటి గుల్ పనాగ్, ఆమె కూతురు అదితిగా అనికా సురేంద్రన్ ఉన్నంత వరకు చక్కగా నటించారు. విలన్ మనీశ్ చౌదరికి మాత్రం యాక్టింగ్ కి పెద్దగా స్కోప్ లేదు. మిగతా పాత్రలంతా కూడా ఓకే. ఇక మ్యూజిక్ గురించి చెప్పాలంటే భరత్-సౌరభ్ అందించిన పాటలు, స్టోరీలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మార్క్ కె రాబిన్.. తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ని తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లాడు. ముఖేశ్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దిలీప్ సుబ్బరాయన్, కీచ్.. యాక్షన్ సీన్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేరు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గురించి చెప్పాలి. నాగ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని, క్లాస్ గా కనిపించే మాస్ యాక్షన్ డ్రామా తీసి ప్రేక్షకుల మనసు గెలిచారు!
రేటింగ్: 2.5/5
చివరిమాట: యాక్షన్ లవర్స్ మాత్రమే నచ్చే సినిమా ‘ద ఘోస్ట్’!