ప్రేక్షకుల్ని నవ్విస్తున్న డబ్బింగ్ మూవీ 'సొప్పన సుందరి'. తాజాగా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చదివేయండి.
ఓటీటీలో ప్రతివారం కొత్త సినిమాలు చాలానే వస్తుంటాయి. వాటిలో సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండి, చూడాలనిపించేవి మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అలాంటి లిస్టులో ఉండే మూవీ ‘సొప్పన సుందరి’. తాజాగా ప్రేక్షకుల్ని పలకరించిన ఈ డబ్బింగ్ మూవీ.. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. టాలీవుడ్ లో కొన్ని మూవీస్ లో నటించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందులో లీడ్ రోల్ చేసింది. మరి డార్క్ కామెడీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీసిని ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ పూర్తిగా చదివేయాల్సిందే.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఓ గోల్డ్ షాపులో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంటుంది. అనారోగ్యానికి గురైన తండ్రి, లోడలోడా మాట్లాడే తల్లి, మూగదైన అక్క ఈమెతో పాటు ఉంటారు. రోజు గడవడమే కష్టంగా ఉంటుంది. చాంతాడంత అప్పులతో బతుకీడుస్తుంటారు. అలాంటిది వీళ్లకు సడన్ గా ఓ ప్రముఖ జ్యూవెల్లరీ స్టోర్ బంపర్ డ్రాలో రూ.10 లక్షలు విలువైన కారు బహుమతిగా వస్తుంది. అక్కడి నుంచి వీళ్ల లైఫ్ లో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కొత్త కొత్త వ్యక్తులు ఎంటరవుతుంటారు. ఈ స్టోరీలో దొర(కరుణాకరన్), అతడి బావ ఏం చేశారు? మరి చివరకు ఏం జరిగింది? అనేది అసలు సినిమా.
మంచాన పడున్న భర్తని, కావాలనే అహల్య తల్లి బాత్రూమ్ లో కింద పడేస్తుంది. దీంతో హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అదే టైంలో డబ్బు బాగా అవసరమై.. భర్త కిడ్నీని లక్ష రూపాయలకు అమ్మేస్తుంది ఈ మహాతల్లి. ఇదే ట్విస్ట్ అనుకుంటే.. ఈ విషయం తెలిసిన కూతురు లక్ష రూపాయలకు ఎందుకు అమ్మావ్? అని తల్లిని తిట్టి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుతుంది. ఇది చదవగానే మీకు ఈ ఫ్యామిలీపై చిరాకు, కోపం కచ్చితంగా వచ్చుంటాయి. కానీ ఇదే సీన్ ని మీరు సినిమాలో చూస్తే ఫుల్ గా నవ్వుకుంటారు. ఎందుకంటే సినిమాలో ఆ సీన్ అలాంటి టైమ్ లో వస్తుంది కాబట్టి. సీరియస్ సిట్చూయేషన్ లోనూ కామెడీ పండించాలంటే అది డార్క్ కామెడీ మూవీస్ కే సాధ్యమవుతుంది. అలాంటి స్టోరీతో తీసిన ‘సొప్పన సుందరి’.. థ్రిల్ చేస్తూ కామెడీ అందించే విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. పైన చెప్పిన లాంటి సీన్లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఈ చిత్రం చూస్తున్నంతసేపు కూడా మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అది నా గ్యారంటీ.
ఫస్టాప్ విషయానికొస్తే.. లక్కీ డ్రా పేరుతో ప్రచారం, హీరోయిన్ ఫ్యామిలీ పరిచయం సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ కాసేపటికే కలలో కూడా ఊహించని విధంగా కారు గిఫ్ట్ గా రావడంతో అహల్య ఫ్యామిలీ అంతా కలిసి ఓ సాంగ్ వేసుకుంటారు. వాళ్ల సంతోషం బాగానే ఉంది గానీ పాటే సెట్ కాలేదు. అక్కడి నుంచి మెల్లగా స్టోరీలోకి వెళ్లిపోతాం. అహల్య బ్రదర్ దొర.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇంటిముందు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత చిన్న సైజ్ గొడవ జరుగుతుంది. ఇలా ఫ్యామిలీ డ్రామా, చిన్న చిన్న గొడవలు లాంటి వాటితో ఇంటెర్వెల్ కార్డ్ పడుతుంది. అసలు కథ సెకండాఫ్ లో స్టార్ట్ అవుతుంది. కారు కోసం అహల్య, దొర కొట్టుకోవడం.. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడం.. చివరకు దాన్ని ఎవరు దక్కించుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోండి. ‘పరాయి వాడి సొమ్ము పాము లాంటిది’, ‘దురాశ దుఖానికి చేటు’.. అనే చిన్న లైన్ ఆధారంగా ఈ మూవీని తీశారు.
ఫ్యామిలీ గొడవలతో ఫస్టాప్ ని నడిపించేసిన దర్శకుడు.. అసలు విషయాన్ని మొత్తం సెకండాఫ్ కోసం దాచుకున్నాడు. అందుకు తగ్గట్లే సస్పెన్స్ తో సినిమా ఉంటుంది. సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్లు బోర్ కొడతాయి కానీ ‘సొప్పన సుందరి’ చూస్తున్నంతసేపు నవ్వుతూ, మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే చాలా సీన్స్ ఇందులో ఉంటాయి. చిన్న చిన్న పాత్రలు కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. చెప్పాలంటే అసలు స్టోరీతో సంబంధం లేని ఒకామె క్లైమాక్స్ లో స్టోరీకి మెయిన్ పాయింట్ ని రివీల్ చేసి థ్రిల్ ఇస్తుంది. మరోవైపు ఇదే సినిమాని కామెడీగా తీసినప్పటికీ.. దొంగతనం, మర్డర్, దెబ్బలాడుకోవడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం లాంటి చాలా విషయాల్ని టచ్ చేశారు. మనం కొన్ని సీన్స్ చాలా సీరియస్ ఉంటాయని అనుకుంటాం. వాటిని కామెడీగా తీసినప్పటికీ.. ప్రేక్షకుల్ని చాలా బాగా కన్విన్స్ చేశారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో అహల్య.. తన తల్లి, అక్కతో చేసే ఓ ఫైట్ అయితే తెగ నవ్విస్తుంది.
అహల్యగా చేసిన ఐశ్వర్య రాజేష్ ఎంత చేస్తే సరిపోతుందో అంత ఫెర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేసింది. సినిమా మొదటి నుంచి చివరి వరకు డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అహల్య తల్లిగా చేసిన దీప శంకర్ అయితే నెక్స్ట్ లెవల్ కామెడీ చేసింది. అహల్య అక్కగా చేసిన లక్ష్మీ ప్రియ.. మూగ అమ్మాయి ఉన్నంతలో బాగా నటించింది. మిగతా అందరూ కూడా తమదైన కామెడీతో కితకితలు పెట్టించారు. శివకార్తికేయన్ ‘డాక్టర్’ మూవీలో ఉన్న అందరూ కమెడియన్స్ ఇందులో ఉంటారు. ‘సొప్పన సుందరి’ చూస్తున్నప్పుడు కచ్చితంగా మీకు అలా అనిపిస్తుంది.
డార్క్ కామెడీ థ్రిల్లర్స్ తీసేటప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కాస్త కష్టమైన విషయమే. కానీ రైటర్-డైరెక్టర్ SG ఛార్లెస్ ఈ విషయం చాలావరకు సక్సెస్ అయ్యాడు. లేడీ యాక్టర్స్ ని పెట్టుకుని చాలా మంచి సినిమా తీశాడనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించిన విశాల్ చంద్రని కూడా మెచ్చుకోవాలి. సినిమాకు సరిగా సరిపోయే మ్యూజిక్ అందించాడు. అజ్మల్ తాసీన్ అందించిన రెండు పాటలు అసలు బాగోలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఈ మూవీకి మరో మేజర్ ప్లస్ పాయింట్ నిడివి. రెండు గంటల్లోపే ఉంది కాబట్టి. ఆడుతూ పాడుతూ చూసేయొచ్చు. ఓవరాల్ గా చెప్పుకుంటే ఓ మంచి కామెడీ థ్రిల్లర్ చూడాలనుకుంటే ‘సొప్పన సుందరి’ ట్రై చేయండి.
చివరగా: నవ్వించే సుందరి.. ఆమె తల్లి!
రేటింగ్: 2.5