Sita Ramam Telugu Movie Review: దుల్కర్ సల్మాన్ రాముడిగా, మృణాల్ ఠాకూర్ సీతగా.. హను’మంతుడి (హను రాఘవపూడి) దర్శకత్వంలో వచ్చిన కలియుగ రామాయణ గాథ ఈ సీతారామం. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 5న రిలీజైన ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్త బ్యానర్స్ లో అశ్వినీదత్ నిర్మించారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, పడి పడి లేచే మనసు వంటి హృద్యమైన ప్రేమ కథా చిత్రాలను అందించిన హను రాఘవపూడి మరో ప్రేమ కావ్యంతో మన ముందుకు వచ్చారు? మరి యుద్ధంతో రాసిన ప్రేమకథ ఎలా ఉంది? మెప్పించిందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
1965 నుండి 1985 మధ్యలో జరిగిన కథ ఈ సీతారామం. అప్పుడు ఇండియా, పాకిస్థాన్ ల మధ్య కశ్మీర్ కోసం యుద్ధం జరుగుతుంది. కశ్మీర్ ని ఆక్రమించాలని పాకిస్థాన్ భావిస్తుంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైనికులతో భారత సైనికులు పోరాడాల్సి వస్తుంది. అందులో ఒక సైనికుడే మన రామ్ దుల్కర్ సల్మాన్. ఇతనొక అనాథ. ఈ అనాథని ప్రేమించే సీతా మహాలక్ష్నీ మృణాల్ ఠాకూర్. 1965లో సీత కోసం రామ్ రాసిన ఉత్తరం 20 ఏళ్లు తర్వాత అంటే 1985లో చేర్చే బాధ్యత పాకిస్థానీ యువతి తీసుకుంటుంది. ఆ యువతి ఎందుకు ఈ బాధ్యత తీసుకుంది? ఆ ఉత్తరాన్ని సీతకు ఇచ్చిందా? అసలు రామ్ కి, పాకిస్థానీ యువతికి సంబంధం ఏమిటి? రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరడానికి 20 ఏళ్లు పట్టడానికి కారణాలు ఏంటి? చివరకి రామ్, సీతని కలుసుకున్నాడా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో పాకిస్తాన్, ఇండియాల మధ్య యుద్ధ వాతావరణాన్ని చూపించాడు దర్శకుడు. పాకిస్థాన్ టెర్రరిస్టులు.. పాకిస్థాన్ ఆర్మీతో కలిసి కశ్మీర్ లో ఉన్న హిందువులపై దాడులు చేయాలని చూస్తారు. ఈ క్రమంలో స్థానిక ముస్లింలను పావులుగా వాడుకుని హిందువుల మీద ఉసికొల్పుతారు. ఆ సమయంలో రామ్ పారదర్శకంగా ఆలోచిస్తాడు. ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు వేసిన ఉచ్చులోంచి అమాయక పాకిస్తాన్ ముస్లింలను కాపాడతాడు. దీంతో రాముడి కేరెక్టర్ ఏంటి అనేది తెలుస్తుంది. “దేశం కోసం ఆలోచించేవాడు సైనికుడు అయితే, ధర్మం కోసం ఆలోచించేవాడు రాముడవుతాడు” అని గొప్ప డైలాగ్ చెప్తాడు. ఇలా పురాణ ఇతిహాసం రాముడి కేరెక్టర్ ని ఈ సినిమాలో రామ్ పాత్రకి ఆపాదించి గొప్పగా చూపించాడు దర్శకుడు. ఇక ఈ కశ్మీర్ కోసం జరుగుతున్న యుద్ధ వాతావరణం నుండి ఒక ప్రేమ చిగురిస్తుంది. సడెన్ గా యుద్ధం నుండి ప్రేమలోకి(ఒక ట్రాన్స్ లోకి) తీసుకెళ్తాడు దర్శకుడు.
ఎవరూ లేని సైనికుడికి భార్య అవ్వాలని అనుకుంటుంది సీత. తాను రామ్ భార్యని అంటూ ఉత్తరం రాస్తుంది. అలా ఈ ఇద్దరూ ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటారు. తర్వాత కలుసుకుంటారు. ఈ క్రమంలో పడిన ఎమోషన్స్, పండిన కామెడీ బాగుంటుంది. అయితే అనుకోకుండా వీరి ప్రేమకి ఒక ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కడో ముస్లిం దేశంలో సంక్షోభం వస్తే ఇక్కడ ఉన్న సీతారామ్ ల ప్రేమకి అడ్డుపడుతుంది. ఈ క్రమంలో సీత రామ్ ని వదులుకోవాల్సి వస్తుంది. రామ్ ని పట్టుకుంటే యుద్ధం జరుగుతుంది. వదిలేస్తే ప్రేమ యుద్ధం జరుగుతుంది. అదే జరిగితే ఎవరూ గెలవరు. అసలు ఈ సీతకి, ముస్లిం దేశానికి సంబంధం ఏంటి అనే ట్విస్ట్ తో దర్శకుడు మెస్మైరైజ్ చేస్తాడు. అసలు ఆమె సీతే కాదు. కానీ రాముడి కోసం సీత అవుతుంది. మరోవైపు పక్కా పాకిస్తానీ అయిన అఫ్రీన్ కి(రష్మిక మందన్న) ఇండియన్స్ మీద ద్వేషం. పైగా స్వార్థం. కేవలం డబ్బు కోసం తాత ఇచ్చిన లెటర్ ని సీతకి చేరవేసే బాధ్యత తీసుకుంటుంది.
సినిమా క్లైమాక్స్ ముందు వరకూ రష్మిక యాంటీగానే ఉంటుంది. సీత ఒక యువరాణి అని తెలిసి రామ్ ప్రేమించాడు అని అనుకుంటుంది. కానీ రామ్ ప్రేమ తెలిసి ఆమె రియలైజ్ అవుతుంది. అసలు తన వల్లే సీతా, రామ్ లు విడిపోయారని తెలుసుకుంటుంది. రామ్ రాసిన ఆఖరి ఉత్తరాన్ని సీతకి ఎలాగైనా చేర్చాలనేది అఫ్రీన్ తాత డ్రీమ్. ఆ లెటర్ ను సీతకి చేరిస్తేనే ఆస్తి దక్కుతుంది అని తాత వీలునామా రాస్తాడు. అయితే ఆస్తి కోసం ఆ లెటర్ ని సీతకి చేర్చాలని ప్రయాణం మొదలుపెట్టిన అఫ్రీన్.. ప్రేమకి లొంగిపోయింది. చివరకు మనసుతో ఆలోచించి సీతకు చేరుస్తుంది. సీత కోసం వెతకడం, రామ్ కోసం వెతకడం.. సీతకి, రామ్ కి చెందిన వ్యక్తుల్ని కలవడం ఇవన్నీ మహానటి సినిమాని గుర్తుచేస్తాయి. అందులో సమంత కూడా సావిత్రి కోసం వెతుకుతుంటుంది. ఇందులో రష్మిక సీతా, రామ్ ల కోసం వెతుకుతుంటుంది. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలు ఏంటి? 20 ఏళ్ల క్రితం రాసిన లెటర్ ని సీతకు చేర్చిందా? ఆ లెటర్ లో ఏముంది? అసలు రామ్ ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో సుమంత్ నెగిటివ్ రోల్ లో కనబడతారు. కానీ చివరికి తన తప్పు తెలుసుకుని రియలైజ్ అవుతారు.
రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతామహాలక్ష్మిగా మృణాల్ ఠాకూర్, అఫ్రీన్ గా రష్మిక, విష్ణు శర్మ పాత్రలో సుమంత్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఇక తరుణ్ భాస్కర్ చివరి వరకూ ట్రావెల్ చేస్తాడు. బాలాజీగా ఆయన పండించిన కామెడీ బాగుంటుంది. ఇక సునీల్ కూడా తన మార్క్ కామెడీతో నవ్వించి వెళ్ళిపోతారు. వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది. ఇక మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, సచిన్ ఖేడ్కర్, గౌతమ్ వసు దేవ్ మీనన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ట్రాక్, ఎమోషనల్ సీన్స్ ని దర్శకుడు బాగా రాసుకున్నారు. కథని ఆద్యంతం ఉత్కంభరితంగా సాగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కథలో ట్విస్ట్ లు థ్రిల్ కి గురిచేస్తాయి. రామాయణంలో జరిగిన సంఘటనలను ఈ సినిమాలో బాగా తెరకెక్కించారు దర్శకుడు. క్లైమాక్స్ మాత్రం ఏడుపు వచ్చేస్తుంది.
సాంకేతిక వర్గం పని తీరు:
ప్రేమకథలతో తనకంటూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న హను రాఘవపూడి ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళారు. సెకండాఫ్ ని సరిగా తీయడంలో విఫలమవుతారన్న విమర్శను ఈ సినిమాతో తిప్పికొట్టారు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ అద్భుతంగా చిత్రీకరించారు. సంగీతం విషయానికొస్తే.. విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ అంత గొప్పగా ఏమీ లేదు కానీ పాటల విషయంలో మాత్రం మంచి ట్యూన్స్ తో ఆకట్టుకుంటారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంటుంది. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరి మాట: హృదయంతో చూడాల్సిన ప్రేమ కథ.
రేటింగ్: 3/5
గమనిక : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే