నితిన్ హీరోగా, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యింది. అంజలి ప్రత్యేక పాటలో నర్తించిన ఈ మూవీలో సముద్రఖని, రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రంగ్‌దే సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ రీమేక్ మాస్ట్రోతో వచ్చి నిరాశపరిచిన నితిన్.. ఇప్పుడు ఫుల్ మాస్ యాక్షన్ మూవీతో మన ముందుకు వచ్చారు. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో మూవీ ఉందా? నితిన్ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం!
1990లో సిటింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో సినిమా మొదలవుతుంది. అక్కడి స్థానిక రాజకీయాలని తానే శాసించాలని, తన గుప్పిట్లో పెట్టుకోవాలని రాజప్ప (సముద్రఖని) భావిస్తాడు. ఎలక్షన్స్ ఊసే లేకుండా, తనని ఎదిరించి నిలబడే క్యాండిడేట్ లేకుండా మాచర్ల నియోజకవర్గ రాజకీయాలని శాసిస్తుంటాడు రాజప్ప. అలాంటి రాజప్పకి సివిల్ ఆఫీసర్ సిద్ధు తగులుతాడు. సివిల్ టాప్ ర్యాంకర్‌గా నిలిచిన సిద్ధు గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఛార్జ్ తీసుకుంటాడు. ఈసారి ఎలాగైనా మాచర్లలో ఎలక్షన్స్ జరిపించాలి, అది నా బాధ్యత అంటూ కలెక్టర్ సిద్దు అంటాడు. ఈ క్రమంలో రాజప్ప, సిద్దుల మధ్య జరిగిన పోరాటమే ఈ మాచర్ల నియోజకవర్గం.
ఈ మూవీలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. యాజ్ యూజువల్‌గా కృతిశెట్టి గ్లామర్ సినిమాకి ప్లస్ అయ్యింది. కృతిశెట్టితో లవ్ ట్రాక్ పర్లేదనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో సినిమాని నిలబెట్టారు. వెన్నెల కిషోర్ లేకపోతే సినిమా లేదనేంతగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీతో ఫస్ట్ హాఫ్ ఏదో అలా సాగుతుంది. మూవీలో యాక్షన్ సీన్స్, డ్యాన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు పాత సినిమాల్లో సన్నివేశాలు గుర్తుకొస్తాయి. రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది. ఇక కేథరిన్ ఎమ్మెల్యేగా, ప్రత్యేక పాటలో అంజలి మెప్పిస్తారు. ‘రా రా రెడ్డి’ ఐటమ్ సాంగ్‌లో అంజలి డ్యాన్స్ బాగుంటుంది. సాంగ్ మధ్యలో వచ్చే ‘రాను రానంటూనే చిన్నదో’ రీమిక్స్ సాంగ్ ఆకట్టుకుంటుంది.
రాజప్పగా సముద్రఖని మార్కు విలనిజం కనబడుతుంది. ఇక సిద్దు తండ్రిగా మురళీశర్మ, తల్లిగా ఇంద్రజ, రాజేంద్రప్రసాద్ తదితరులు తమ పరిధి మేరకు బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా సెకండాఫ్ మాత్రం బాగుంది. దీంతో నితిన్ యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. నితిన్ తనను తాను నటుడిగా కంటే కూడా కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. కథలో యాక్షన్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ తప్పితే కొత్తదనం లేదు. నిజానికి ఇది పాత స్టోరీనే, కొత్తగా ప్రెజెంట్ చేశారు. టెక్నికల్‌గా ప్రెజెంటేషన్ బాగుంది కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా కొత్తగా ఉంటే జనానికి నచ్చేదేమో. కొత్త కథల కోసం, కొత్త స్క్రీన్‌ప్లేల కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో కొంచెం నిరాశపరుస్తుంది. సాగదీతగా అనిపిస్తుంది. కానీ ఒకసారి చూడచ్చు అనేలా ఉంది.
ఎం.ఎస్.రాజశేఖర్‌కి దర్శకుడిగా ఇది తొలి సినిమా. దర్శకుడిగా తన సత్తా అయితే చాటగలిగారు గానీ రొటీన్ కథతో రావడం వల్ల ఆయన ఖాతాలో హిట్ మిస్ అయ్యింది. కమర్షియల్ సినిమాలని డీల్ చేయగలరన్న మార్కు కొట్టేశారు గానీ కొత్తదనం చూపించడంలో ఫెయిలయ్యారనేది అర్ధమవుతుంది. ఇక ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ స్టైలిష్‌గా ఉంది. నితిన్‌ని చాలా స్టైలిష్‌గా చూపించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌కి పేరు పెట్టాల్సిన పని లేదు. ఇక సంగీతం విషయానికొస్తే మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అదరగొట్టారు. పాటలు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. నితిన్ కోసం మాత్రమే ఇంత భారీ బడ్జెట్ చేసినట్టు ఉంది.
ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.