ఇండస్ట్రీలో హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ పై స్టోరీని రాయగల దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి.. తనతో సినిమాలు చేసిన హీరోలందరిని ఎన్నడూ చూడని వేలో చూపించి బ్లాక్ బస్టర్స్ తీశాడు. మరోవైపు అర్జున్ రెడ్డి లాంటి మాసీవ్ హిట్ తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. కేవలం విజయ్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మరి డాషింగ్ డైరెక్టర్ – రౌడీ హీరో కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.
విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ‘లైగర్’. ఈ కాంబినేషన్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అదిగాక పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. తాజాగా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగులో డెబ్యూ చేస్తోంది. మరి మాసీవ్ కాంబో పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండల లైగర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
కరీంనగర్ కు చెందిన బాలామణి(రమ్యకృష్ణ).. తన కొడుకు లైగర్(విజయ్ దేవరకొండ)తో కలిసి ముంబైలో ఛాయ్ బండి నడుపుతుంటుంది. ఎలాగైనా తన కొడుకు లైగర్ ని బాక్సింగ్ లో నేషనల్ ఛాంపియన్ గా చూడాలనే కోరికతో సొంతవూరు నుండి ముంబైకి వచ్చి.. లైగర్ ని ఓ ఫేమస్ బాక్సింగ్ కోచ్ దగ్గర జాయిన్ చేస్తుంది. ఈ క్రమంలో పుట్టుకతోనే నత్తి ఉన్న లైగర్ కి డబ్బున్న ఫ్యామిలీకి చెందిన తానియా(అనన్య పాండే) తారసపడుతుంది. పరిచయం కాస్తా ప్రేమగా మారిన.. కొద్దిరోజులకే కొన్ని కారణాల వల్ల లవ్ బ్రేకప్ అవుతుంది. అప్పటినుండి కెరీర్ పై ఫోకస్ పెట్టిన లైగర్ నేషనల్ ఛాంపియన్ షిప్ గెలిచి.. ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ ని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ నేపథ్యంలో లైగర్ లైఫ్ లోకి పలు షాకింగ్ ట్విస్టులు ఎంటర్ అవుతుంటాయి. మరి లైగర్ బాక్సర్ గా ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ గెలిచాడా లేదా?తానియాతో లవ్ ఎందుకు బ్రేకప్ అయ్యింది? లైగర్ లైఫ్ లో వాళ్ళమ్మ పాత్ర ఎంతవరకు ఉంది? చివరిగా లైగర్ ఏం సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అని అనౌన్స్ చేసినప్పుడే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే.. హీరోల క్యారెక్టర్, యాటిట్యూడ్ లతో సినిమాలు తీసే పూరికి.. ఆల్రెడీ తనకంటూ ఓ యాటిట్యూడ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండతో మూవీ అంటే.. ఎలాంటి కొత్త బాడీ లాంగ్వేజ్ చూపిస్తాడో అనే ఆసక్తి పెరిగింది. అందులోనూ.. లైగర్ అనే టైటిల్, వాట్ లగా దేంగే లాంటి డైలాగ్స్ తో సినిమాపై ఇంటరెస్ట్ కలిగించారు. అదీగాక పాన్ ఇండియా హీరో కాకముందే విజయ్ ఫ్యాన్ బేస్ ఎలా ఉందో తెలిసిందే. మరి వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ మూవీ.. మినిమమ్ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇక లైగర్ విషయానికి వస్తే.. టైటిల్స్ వచ్చేసి పూరి మార్క్ లోనే పడ్డాయి. ట్రైలర్ లో చూపించినట్లుగానే బాక్సింగ్ రింగ్ లో విజయ్ లైగర్ పేరును అనౌన్స్ చేస్తూ.. హీరో క్యారెక్టర్ ని పరిచయం చేశారు. అక్కడినుండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో తల్లి క్యారెక్టర్.. ఇద్దరు ముంబైలో ఛాయ్ బండి నడపడంతో కథ మొదలవుతుంది. హీరో పవర్ ఫుల్ అని తెలియడానికి ఓ ఫైట్ తో క్యారెక్టర్ ని.. అతనికి ఉన్న నత్తిని పరిచయం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత తల్లికొడుకు ఇద్దరు ముంబై రావడానికి కారణం.. వారి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చెబుతూనే.. హీరో లక్ష్యం ఏంటనేది కూడా చూపించారు. కాకపోతే హీరోకి నత్తి ఉండటం అనేది కొత్తగా ఉంటుంది.. అదే టైంలో విసుగు కూడా తెప్పించే అవకాశం ఉంది.
ఎందుకంటే.. డైరెక్టర్ పూరి హీరోలంతా సినిమాలలో చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా.. గలగలా మాట్లాడుతూ మాస్ డైలాగ్స్ కొడుతుంటారు. అదీగాక ఇక్కడ విజయ్ దేవరకొండ.. అతను మాటతీరు చూసి మాస్ డైలాగ్స్ కొట్టగలడని చెప్పవచ్చు. కానీ.. ఈ సినిమాలో మాట మాటకి హీరో నత్తితో ఇబ్బంది పడటం అనేది.. చూసేవారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. విజయ్ నోట్లో పూరి మార్క్ మాస్ డైలాగ్స్ ఎక్సపెక్ట్ చేస్తే కష్టమే. ఎందుకంటే.. సినిమాలో అంత స్కోప్ లేకుండా పోయింది. ఇక బాక్సింగ్ ట్రైనింగ్ లో చేరాక.. హీరోయిన్ తానియా(అనన్య పాండే)తో పరిచయం కొత్తగానే ఉంటుంది. కానీ.. మరుసటి రోజే నేరుగా హీరో ఇంటికి హీరోయిన్ రావడం.. అక్కడినుండి ఎన్నో ఏళ్లుగా లవర్స్ అన్నట్లుగా బిహేవ్ చేయడం ఓవర్ గా అనిపించవచ్చు.
ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ని చాలా తేలికగా చూపించాడు దర్శకుడు. ఎంత ట్రెండ్ మారినా అమ్మాయిలను సినిమాలలో అయినా అందంగా, హుందాగా చూపిస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ.. ఈ సినిమాలో హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అంతా టాప్ టు బాటమ్ అందాల ఆరబోతకే కేటాయించారు. హీరోయిన్ క్యారెక్టర్ వీక్ గా డిజైన్ చేశారనే చెప్పాలి.. మరోవైపు హీరోయిన్ బ్రదర్ బాక్సర్ సంజు(విషు)కి, లైగర్ కి మధ్య వార్ మొదలవుతుంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక బ్రేకప్ బాధలో కెరీర్ పై ఫోకస్ పెట్టి.. హీరో అందరిని ఓడించి నేషనల్ ఛాంపియన్ షిప్ కొట్టడంతో సెకండాఫ్ మొదలైంది. సెకండాఫ్ లో హీరో తల్లికి, హీరోయిన్ కి.. మిగతా క్యారెక్టర్స్ కి పెద్దగా స్కోప్ ఉండదు. అక్కడక్కడా కనిపిస్తుంటారు.
లైగర్ కి కోచ్ గా రోనిత్ రాయ్ ని చూపించిన మేకర్స్.. లైగర్ తండ్రి కూడా ఒకప్పుడు పాపులర్ బాక్సర్ అని చెప్పి.. ఎక్కడకూడా అతని పాత్రను పరిచయం చేయకపోవడం గమనార్హం. సినిమాలో పూరి మార్క్ ఫైట్స్ ఉన్నాయి.. కానీ.. ఎక్సపెక్ట్ చేసిన మాస్ ఎలిమెంట్స్.. డైలాగ్స్.. ట్విస్టులు.. అదిరిపోయే పాటలు.. హీరో బాడీ లాంగ్వేజ్ ఇలా ఏ విషయంలోను పూరి మార్క్ కనిపించలేదు. సినిమాలో సరైన ఎమోషన్స్, తల్లికొడుకు మధ్య బంధం, లవ్ సీన్స్ ఏవి కూడా బలంగా లేవనే ఫీలింగ్ కలిగి.. ప్రేక్షకులకు బోరింగ్ అనిపించకమానదు. సినిమాలో విలన్ చెల్లి హీరోయిన్ గా చూపించడం.. గతంలో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్ సినిమాలో రవితేజ, సుబ్బరాజుల క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. బాక్సింగ్ సినిమా కాబట్టి.. పాత సినిమాల తాలూకు లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.
కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్.. సినిమా సోల్.. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ గురించి ఎక్కడా గొప్ప సీన్.. ఎమోషన్ క్రియేట్ చేయలేదు. మధ్యమధ్యలో సినిమాకు లైగర్ అనే టైటిల్ సెట్ కాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. టైటిల్ లో ఉన్న పవర్ క్యారెక్టర్స్ లో లేదు. క్లైమాక్స్ లో లెజెండ్ మైక్ టైసన్ ఎపిసోడ్ బాగుంది. కానీ.. అక్కడకూడా టైసన్ క్యారెక్టర్ ని కామెడీ చేశాడు దర్శకుడు. హీరోకి రోల్ మోడల్ గా చూపించిన మైక్ టైసన్ ని హీరోనే కొట్టడం మింగుడు పడదు. అందులోనూ.. అన్నింట్లో కంటే ఈ సినిమాలో బూతులు ఎక్కువగా వాడారు. బీప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక సినిమా కథ రొటీన్.. స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా లేదనిపిస్తుంది. లైగర్ కి సాంగ్స్ మేజర్ మైనస్.
ఇక లైగర్ గా విజయ్ అదరగొట్టాడు. అతని క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. హీరో తల్లిగా రమ్యకృష్ణ పవర్ ఫుల్ గా ఉంది.. అయినా పరవాలేదనిపిస్తుంది. హీరోయిన్ ని కేవలం గ్లామర్ కోసమే పెట్టారు.. క్యారెక్టర్ చాలా వీక్. మిగతా క్యారెక్టర్స్ అన్నీ వాటి పరిధి మేరకు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ పూరి మార్క్ మిస్ అయిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ఇది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ మేజర్ మైనస్. ఒక్క సాంగ్ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు. లిరిక్స్ అసలు అర్థం కావు. సునీల్ కష్యప్ బిజీఎం పరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే.. ఎంచుకున్న నేపథ్యం వైపు కాకుండా కథ రొటీన్ మలుపుlలు తిరగడంతో యావరేజ్ గా అనిపించవచ్చు.
మిస్ ఫైర్ అయిన ‘లైగర్’ పంచ్!
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!