ఇండస్ట్రీలో రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ.. సినిమా సినిమాకి డిఫరెంట్ జానర్స్, స్టోరీస్ తో ప్రయోగాలు చేస్తున్న హీరోలు తక్కువ. టాలీవుడ్ లో మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు పెట్టింది పేరు యంగ్ హీరో నిఖిల్. కేశవ, కార్తికేయ మొదలుకొని, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా ఇలా వరుస థ్రిల్లర్ మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న నిఖిల్.. ఇప్పుడు మరోసారి మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ‘కార్తికేయ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే జానర్, అదే పేరుతో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కార్తికేయ తర్వాత నిఖిల్ – దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ 2 మూవీ.. ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నీ విషయాలలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. కంటెంట్ ప్రధానంగా సినిమాలు చేసే హీరో నిఖిల్.. అదే విధంగా కంటెంట్ ని నమ్మి సినిమాలు నిర్మించే అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు పుట్టిపెరిగిన ద్వారక నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే ప్రమోషన్స్ లో, ట్రైలర్ లో చెప్పేశారు. మరి మరోసారి తన ఫేవరేట్ జానర్ లో చేసిన కార్తికేయ 2 మూవీ.. హీరో నిఖిల్ కి హిట్ ఇచ్చిందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం!
డాక్టర్ కార్తికేయ(నిఖిల్) సైన్స్ ని నమ్ముతాడు కానీ.. దేవుడిని నమ్మడు. ఎప్పుడూ తెలియని విషయాలను తెలుసుకోవడానికి, వాటిని చేధించేందుకు ట్రై చేస్తుంటాడు. అలాంటి కార్తికేయ ఓ మొక్కు కారణంగా తన తల్లితో కలిసి ద్వారకాకు వెళ్తాడు. అక్కడినుండి కార్తికేయ లైఫ్ లో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో కార్తికేయకి ముగ్ధ(అనుపమ) పరిచయం అవుతుంది. ఆ తర్వాత విధి తనకు ముందే ఓ గమ్యాన్ని డిసైడ్ చేసిందని తెలుసుకుని దాన్ని సాధించే పనిలో పడతాడు. మరి దేవుడిని నమ్మని కార్తికేయ ద్వారకాకి ఎందుకు వెళ్లాడు? కార్తికేయ లైఫ్ లో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఎందుకొచ్చింది? కార్తికేయకి, ద్వారకాకి సంబంధం ఏంటి? ఆ తర్వాత కార్తికేయ లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది? చివరికి కార్తికేయ ఇచ్చిన సందేశం ఏంటనేది తెరపై చూడాల్సిందే.
కార్తికేయ లాంటి మిస్టరీ థ్రిల్లర్ తర్వాత హీరో నిఖిల్, దర్శకుడు చందూ కాంబినేషన్ లో సీక్వెల్ రానుందని గతంలోనే ప్రకటించారు. అయితే.. కార్తికేయ మూవీ ద్వారా దేవుడికి సంబంధించిన మిస్టరీని చాలా థ్రిల్లింగ్ గా చూపించి మెప్పించారు. ఇప్పుడు కార్తికేయ సీక్వెల్ అనేసరికి ఎలాంటి థ్రిల్లర్ ని చూపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. కార్తికేయలో సుబ్రహ్మణ్యస్వామి చుట్టూ కథ తిరుగుతుంది. కానీ.. కార్తికేయ 2 మూవీ.. శ్రీకృష్ణుడు, ఆయన పాలించిన ద్వారకా.. వీటి చుట్టూ ముడిపడి ఉన్న మిస్టరీల నేపథ్యంలో కథ సాగుతుంది. డెబ్యూ మూవీ అయినప్పటికీ కార్తికేయ మూవీని పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా మలిచాడు దర్శకుడు. ఇప్పుడు సీక్వెల్ విషయంలో కూడా అదే పని చేశాడు.
కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్స్ తర్వాత హీరో నిఖిల్ వేరే జానర్ లో సినిమాలు చేశాడు. కానీ.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే.. మళ్లీ తనకు బాగా కలసి వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యాన్ని ఎంచుకొని కార్తికేయ 2 చేశాడు. ట్రైలర్ తో కార్తికేయ 2 పై భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. సబ్జెక్టు సెలక్షన్ తోనే ఫుల్ మార్క్స్ కొట్టేశారు. డాక్టర్ కార్తికేయ ద్వారకా ప్రయాణం.. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు.. నేపథ్యంలో కథను సాగించారు. ఇక సినిమా విషయానికి వస్తే.. భగవంతుడు శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకా ఎందుకు నీటమునిగింది? అనే విషయాన్నీ ప్రస్తావిస్తూ సినిమా మొదలైంది.
రానున్న కలికాలంలో మానవాళి ఎలాంటి విపత్తులు ఎదుర్కోబోతుంది? మనుషుల జీవనం ఎలా ఉండబోతుంది? అనేది సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు ఉద్దవుడికి వివరిస్తాడు. ఫ్యూచర్ లో రాబోయే అన్నీ విపత్తులను ఫేస్ చేసేందుకు తన కాలి కంకణంలో రహస్యాలను నిక్షిప్తం చేసి.. ఆ కంకణాన్ని ఉద్దవుడికి ఇస్తాడు. కలికాలంలో ప్రపంచాన్ని కాపాడేందుకు విధిని ఎదుర్కొని ఒకడు వస్తాడని చెబుతాడు. ఇలా చాలా ఇంటరెస్టింగ్ గా ఫస్ట్ హాఫ్ మొదలై.. హీరో ఇంట్రడక్షన్, తనకు తెలియకుండానే ద్వారకాతో లైఫ్ ముడిపడి ఉండటం.. హీరో తల్లితో మొక్కు కోసం ద్వారకాకు వెళ్లడం.. ఇలా చాలా ఆసక్తికరమైన కథతో.. బ్రీత్ టేకింగ్ స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఇక ఇంటర్వెల్ ముందే హీరో గమ్యం ఏంటనేది మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక సెకండాఫ్ లో మనకు శ్రీకృష్ణుడికి సంబంధించి ఎన్నో తెలియని దైవ రహస్యాలను తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. దైవం పేరుతో మనుషులు ఎలా మోసపోతున్నారు? అనేది కూడా చూపించాడు. సెకండాఫ్ చాలా ఆసక్తికరంగా హీరో ప్రయాణంతో మొదలైంది. హీరోకి తోడుగా హీరోయిన్ ముగ్ధ(అనుపమ) ఎంటర్ అవ్వడం.. అసలు ఈ కథకు కార్తికేయకు సంబంధం ఏంటనేది రివీల్ చేయడం.. మైండ్ బ్లాక్ చేస్తుంది. ఎక్కడా స్లో అవ్వకుండా చాలా స్పీడ్ గా కథను నడిపించారు దర్శకుడు, ఎడిటర్. ఇక కార్తికేయ ప్రయాణంలో శ్రీకృష్ణుడు పాత్ర ఎంతవరకు ఉంది? కార్తికేయ లైఫ్ కి, విధి తోడవ్వడం, క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడు ఒక్కో రహస్యాన్ని కార్తికేయ చేధించడం.. ప్రతి పాయింట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
సినిమాలో ప్రతి సీన్.. ప్రతి మిస్టరీ ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. కార్తికేయకి రెట్టింపు సస్పెన్స్ ఎలిమెంట్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్.. అన్నీ ఈ సీక్వెల్ కి కుదిరాయనే చెప్పాలి. దాదాపు రెండున్నర గంటల వరకూ థియేటర్లో ప్రేక్షకులు పిన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమాను ఎంజాయ్ చేశారు. జానర్ పాతదే అయ్యుండొచ్చు కానీ.. సినిమాలో మ్యాటర్ చాలా కొత్తది. కార్తికేయ పాత్రలో నిఖిల్ మరోసారి మెప్పించాడు. అలాగే కార్తికేయ ప్రయాణాన్ని పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేశాడు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టంనేని. అదిగాక ఈ సినిమాకు ఎడిటర్ కూడా కార్తీకే కావడం విశేషం. హీరోయిన్ అనుపమతో పాటు కమెడియన్ శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష ఆకట్టుకున్నారు.
శ్రీకృష్ణుడి రహస్యాలను చేధించే ఎవరినైనా అడ్డుపడి చంపే విలన్ శంతనుగా ఆదిత్య మీనన్.. స్పెషల్ క్యామియో రోల్ లో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్స్ థ్రిల్ కి గురిచేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ కార్తికేయ 2ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అద్భుతమైన మిస్టిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ కలిగించాడు. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ల నిర్మాణ విలువలు అదిరిపోయాయి. చివరిగా కెప్టెన్ ఆఫ్ ది మూవీ చందూ మొండేటి.. పర్ఫెక్ట్ మిస్టరీ థ్రిల్లర్ గా కార్తికేయ 2ని తెరపై ప్రెజెంట్ చేశాడు. ఆలోచింపజేసే డైలాగ్స్ తో పాటు ఎంగేజింగ్ నేరేషన్, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాడు. పక్కా ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే పర్ఫెక్ట్ పిక్చర్ ఈ కార్తికేయ-2.
చివరిమాట: కార్తికేయ 2.. బ్లాక్ బస్టర్ మిస్టరీ థ్రిల్లర్!
రేటింగ్: 3.5/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!