ఓటీటీలు మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల్ని కూడా ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూస్తున్నాం. అందుకు తగ్గట్లే ప్రతి వారం కూడా కొత్త కొత్త మూవీస్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అలా ఈ వారం, తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘కాపా’. పృథ్వీరాజ్ సుకుమారన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, అన్నా బెన్ తదితరులు నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్.. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
ఆనంద్ (అసిఫ్ అలీ) ఐటీ ఉద్యోగి. బిను త్రివిక్రమన్ (అన్నాబెన్) ని పెళ్లి చేసుకుంటాడు. బెంగళూరు నుంచి తిరువంతనపురంకు ట్రాన్స్ ఫర్ అవుతాడు. ఆ ఊరు గ్యాంగ్ స్టర్స్ కు అడ్డా. ఈ క్రమంలోనే కేరళ గవర్నమెంట్.. గ్యాంగ్ స్టర్స్ ని అరికట్టేందుకు కాపా(కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అమలు చేస్తుంది. అందులో తన భార్య పేరు కూడా ఉందని.. ఓ పోలీస్ ద్వారా ఆనంద్ తెలుసుకుంటాడు. పాత గొడవల కారణంగా తన భార్యకు ఎలాంటి హానీ జరగకూడదని ఆ ఊరిలోనే పెద్ద గ్యాంగస్టర్ అయిన కొట్ట మధు(పృథ్వీరాజ్) ని కలిసి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ విషయంలో మధు భార్య ప్రమీలా (అపర్ణా బాలమురళి) ఆనంద్ కు సాయం చేస్తుంది. ఆనంద్, కాపా లిస్ట్ నుంచి తన భార్య పేరు తొలగించగలిగాడా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓ ఊరిలో రెండు గ్యాంగ్ స్టర్ గ్రూపులు, అధికారం కోసం వారి మధ్య ఆధిపత్య పోరు.. దీని మధ్యలో రాజకీయాలు, పోలీసులు.. ఈ పాయింట్ చెప్పగానే ఎక్కడో చూసినట్లు ఉందే అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. అవును ఈ సినిమా కూడా సేమ్ అలాంటి కథతోనే తీశారు. సాధారణంగా మలయాళ మూవీస్ అనగానే.. కంటెంట్ ఓరియెంటెడ్ కథలకు ఫేమస్ అని అంటుంటారు. అయితే అప్పుడప్పుడు ఇలాంటి బోర్ కొట్టించే కథలు కూడా వస్తుంటాయి. ఆ కోవకు చెందినదే ఈ సినిమా. ఆనంద్ కారు బోల్తా పడే సీన్ తో సినిమా ప్రారంభించిన డైరెక్టర్.. అసలు దీనికి కారణం ఏంటనే విషయాన్ని సీన్ బై సీన్ చూపించారు. ఇక రెండు గ్రూపుల మధ్య గొడవని చూపించారు. కానీ ఆయా సీన్స్ లో ప్రేక్షకులని కట్టిపడేసే ఎమోషన్ అస్సలు లేదు. ఓ రొటీన్, కమర్షియల్ డ్రామాగా అనిపిస్తుంది.
తన భార్యని కాపాడుకునేందుకు ఓ భర్త ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? ఎక్కడి వరకు వెళ్లాడు? అనే పాయింట్ ని బాగానే రాసుకున్నారు. కానీ దాన్ని చూపించడంలో మాత్రం పూర్తిగా తడబడ్డారు. ఇక కొట్ట మధు పాత్రనైతే భారీ గ్యాంగ్ స్టర్ అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ ఒకట్రెండు ఫైట్ సీన్స్ మాత్రమే పెట్టారు. ఇక ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మరీ పేలవంగా అనిపించాయి. మొత్తం సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టు, చివర్లో వచ్చే సీన్స్ మాత్రమే కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. కానీ స్టోరీకి స్కోప్ అయితే పెద్దగా లేదు. అయితే క్లైమాక్స్ సీన్స్ ని ఇంటర్వెల్ లో పెట్టి.. ప్రమీలా, బిను పాత్రల మధ్య ఫేస్ ఆఫ్ పెట్టుంటే బాగుండేదని అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఓ రొటిన్ కమర్షియల్ సినిమా ‘కాపా’.
ఈ సినిమాలో కొట్ట మధుగా చేసిన పృథ్వీరాజ్, అతడి భార్య ప్రమీలాగా చేసిన అపర్ణా బాలమురళి మాత్రమే మనకు తెలుసు. వాళ్లిద్దరూ ఇచ్చిన క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. అయితే కథలో వేగం లేకపోవడం వల్ల వీళ్లతో పాటు అసిఫ్ అలీ, అన్నాబెన్ లాంటి వాళ్లకు నటించడానికి స్కోప్ లేకుండా పోయింది. ఫలానా పాత్ర అదిరిపోయిందని ఎక్కడా అనిపించదు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమా ఓకే అనిపిస్తుంది. చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్లే చాలా సీన్స్ కాస్త చూడటానికి బాగుంటాయి. అది కూడా లేకపోయింటే మూవీ మరింత ఘోరంగా తయారయ్యేది. ఫస్ ఈ సినిమాకు వేణు డైరెక్టర్. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన తప్పుకోగా… ఆ స్థానంలో షాజీ కైలాస్ వచ్చారు. ఓ రొటీన్ కమర్షియల్ డ్రామాగా దీన్ని తీసేశారు. అయితే ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంటర్ టైన్ చేయడం కష్టమే!
చివరగా: ‘కాపా’.. తెలుగు ప్రేక్షకులకు నచ్చడం కష్టమే!
రేటింగ్: 1.5