సుడిగాలి సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తనదైన కామెడీ సెన్స్ తో అందరినీ నవ్విస్తూనే.. హీరోగా కూడా పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్.. సినిమాల్లో ఫ్రెండ్ కేరెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా చేసే స్థాయికి ఎదిగారు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. తాజాగా సుధీర్ నటించిన ‘గాలోడు’ మూవీ ఇవాళ (నవంబర్ 18న) రిలీజ్ అయ్యింది. సుధీర్ హీరోగా వచ్చిన తొలి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే ఈ గాలోడు సినిమాకి దర్శకత్వం వహించారు. సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీ యావరేజ్ గా ఆడింది. మరి రెండో ప్రయత్నంగా వచ్చిన ఈ గాలోడు సుధీర్ కెరీర్ లో హిట్ గా నిలిచిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
రాజు (సుడిగాలి సుధీర్) ఒక పల్లెటూరు యువకుడు. ఊళ్ళో గాలోడిలా తిరుగుతూ ఉంటాడు. బాధ్యతలు లేకుండా బతికే సుధీర్.. పేకాట ఆడుతూ ఉంటాడు. ఒకరోజు పేకాట ఆడుతున్న సమయంలో సర్పంచ్ కొడుకుతో కొట్లాటకు దోగుతాడుదిగుతాడు. ఈ ప్రాసెస్ లో సర్పంచ్ కొడుకు చనిపోతాడు. అప్పటి వరకూ సరదా సరదాగా బతికిన రాజు.. భయంతో ఊరు వదిలి హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ కాలేజ్ స్టూడెంట్ శుక్ల (గెహ్నా సిప్పీ) పరిచయం అవుతుంది. కొందరు ఆకతాయిలు ఏడిపిస్తుంటే వారి నుంచి శుక్లను కాపాడతాడు రాజు. కృతజ్ఞతతో రాజుని తన ఇంటికి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. తండ్రి కారు డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పిస్తుంది. గాలోడు కాస్తా పనోడు కావడంతో శుక్ల గాలి రాజువైపు మళ్లుతుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది. ఈ ప్రేమాయణం నడుస్తుండగా.. ఊర్లో హత్య చేసి పారిపోయిన రాజుని వెతుక్కుంటూ పోలీసులు హైదరాబాద్ వస్తారు. రాజుని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి జైలు నుంచి రాజు ఎలా బయటకి వస్తాడు? తాను నిర్దోషిని అని ఎలా నిరూపించుకున్నాడు? అనేది మిగతా కథ.
హీరో ఊళ్ళో గాలోడుగా తిరగడం, బాధ్యత లేకుండా ఉండడం.. ఆ తర్వాత లైఫ్ లో ఊహించని ఘటన జరగడం, ఆ తర్వాత అమ్మాయి కోసం ఫైట్ చేయడం, ఆ ఫైట్ సీన్ లో హీరోని చూసి ఇంప్రెస్ అవ్వడం, తర్వాత ప్రేమలో పడడం, ప్రేమని తండ్రి అంగీకరించకపోవడం, హీరో ఒప్పించడం.. ఈ నేపథ్యం కలిగిన సినిమాలు పది, పదిహేనేళ్ల క్రితమే వచ్చాయి. ఈ సినిమాలు ప్రేక్షకులకి బోర్ కొట్టాయి. అయినా కూడా ఒక రొటీన్ కథను దర్శకుడు ఎంచుకోవడం అనేది సాహసం అనే చెప్పాలి. అతనే నిర్మాత కాబట్టి తన కథ మీద నమ్మకం ఉండి ఉండవచ్చు. కంటెంట్ పరంగా సినిమా వీక్ గా ఉన్నప్పటికీ.. దర్శకుడిగా టేకింగ్ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళాడు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి. తాను సుధీర్ తో తీసిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కంటే కూడా ఈ గాలోడు టేకింగ్ స్టైల్ బాగుంది. ఒక స్టార్ హీరోని చూపించినట్టే సుధీర్ ని చూపించాడు. ఒక స్టార్ హీరోతో సినిమా తీయగలను అని నిరూపించుకున్నాడు. ఒక రైటర్ గా ఫెయిల్ అయినా దర్శకుడిగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
ఇప్పటి వరకూ సుధీర్ ని ఈ రేంజ్ లో ఎవరూ చూపించలేదు. ఈ సినిమాలో సుధీర్ చాలా బాగా చూపించారు. కొంచెం రొటీన్ స్టోరీలా అనిపించినా.. సుధీర్ కోసం కోసం చూడొచ్చు. పెద్ద హీరో సినిమాలో ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. సుధీర్ కెరీర్ లో గాలోడు పక్కా కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. రొటీన్ స్టోరీ అయినా తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునే విషయంలో సుధీర్ సక్సెస్ అయ్యాడు. నటన పరంగా కూడా గత సినిమాలతో పోలిస్తే ఇంప్రూవ్ అయ్యాడు. అలానే డాన్సులు, స్టంట్స్ లో సుధీర్ పెద్ద హీరోలా చేశాడు. ఈ సినిమా కోసం సుధీర్ చాలా కష్టపడినట్లు సినిమా చూస్తేనే తెలుస్తుంది. సినిమా కంటెంట్ పరంగా నిరాశపరిచినా సుధీర్ ఏంటో అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. కాబట్టి సుధీర్ కి కమర్షియల్ హీరోగా ఎదిగే అవకాశం కనబడుతుంది. సుధీర్ అంటే కామెడీ లేకపోతే ఎలా? అందుకే కావాల్సినంత కామెడీని మూవీలో జోడించాడు దర్శకుడు.
అయితే నిజ జీవితంలో తల్లిదండ్రులని ఎంతగానో ప్రేమించే సుధీర్ ని.. ఈ సినిమాలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆవారాగా తిరగడమే కష్టంగా ఉంటుంది. అయితే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప్పడతాడనుకోండి. దాదాపు తన పాత్రకి సుధీర్ ఎంత న్యాయం చేయాలో అంతా న్యాయం చేశాడు. కథ ఇంకా బాగా రాసుకుని ఉంటే సుధీర్ యాక్టింగ్ కి స్కోప్ ఉండేది. ఇక గెహ్నా సిప్పీ సుధీర్ కి జోడీగా బాగానే నటించింది. సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీరాజ్, సత్యకృష్ణన్ లాంటి నటులు తమ పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతిక వర్గం విషయానికొస్తే.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్ గా కనబడుతుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే విజువల్స్ ఆకట్టుకుంటాయి. బాబా భాస్కర్, అనీష్, వెంకట్ దీప్ ల కొరియోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది.