మిల్కీ బ్యూటీ తమన్నా, అభిషేక్ బజాజ్, సాహిల్ వేద్ ప్రధాన తారాగణంతో.. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్త బ్యానర్స్ లో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బబ్లీ బౌన్సర్. హిందీ భాషలో తెరకెక్కిన ఈ సినిమా డిస్నీ+ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. మూవీ ప్రమోషన్స్ లో కూడా మిల్కీ బ్యూటీ చురుగ్గా పాల్గొంది. ఈ సినిమాతో తనకి నేషనల్ అవార్డు రావడం పక్కా అని యమా కాన్ఫిడెంట్ గా చెప్పింది. మరి ఈ సినిమాలో తమన్నా నేషనల్ లెవల్ యాక్టింగ్ చేసిందా? మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాతో సక్సెస్ అందుకుందా? తమన్నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కథ ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాడీ బిల్డింగ్, బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్ ఢిల్లీలో ఉన్న ఫతేపూర్ బేరీ గ్రామం. ఈ గ్రామంలో బబ్లీ (తమన్నా) అనే యువతి మగరాయుడిలా తిరుగుతూ ఉంటుంది. తండ్రి (సౌరబ్ శుక్లా) బబ్లీని అల్లారు ముద్దుగా పెంచడం వల్ల ఇలా తయారవుతుంది. పదవ తరగతి కూడా పాసవ్వదు. అలాంటి బబ్లీ.. షేహ్రీ బాబు (అభిషేక్ బజాజ్) తో ప్రేమలో పడుతుంది. అయితే షేహ్రీ బాబు బబ్లీకి పరీక్ష పెడతాడు. బబ్లీని తన సొంత కాళ్ళ మీద నిలబడితే ప్రేమని అంగీకరిస్తామని అంటాడు. దీంతో బబ్లీ తన గ్రామానికి చెందిన కుక్కు (సాహిల్ వేద్ఐ సాయంతో ఢిల్లీ వెళ్తుంది. అక్కడ ఒక పబ్ లో బౌన్సర్ గా జాయిన్ అవుతుంది. ఈ క్రమంలో లేడీ బౌన్సర్ గా మారిన బబ్లీకి పబ్ లో ఎదురైన అనుభవాలు ఏమిటి? పబ్ లో రౌడీలను ఎలా ఎదిరించింది? ఎదిరించే క్రమంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? మరోవైపు ప్రేమించిన వ్యక్తి దూరంగా ఉన్నాడన్న బాధ, ఉద్యోగం నిలబెట్టుకుంటే ఆ వ్యక్తి దగ్గరవుతాడన్న సంతోషం.. కానీ ఉద్యోగంలో మగవారితో ఎదురయ్యే సమస్యలు.. బబ్లీలో తెలియని సంఘర్షణ మొదలవుతుంది. చివరికి బబ్లీ తన ప్రేమను గెలుచుకుందా? అసలు బబ్లీ బౌన్సర్ గానే మారడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు రక్షణగా బౌన్సర్లు ఉండడం అనేది సహజమే. అయితే మనం రెగ్యులర్ గా మగ బౌన్సర్లనే ఎక్కువగా చూస్తాం. అలాంటిది తమన్నాని లేడీ బౌన్సర్ గా చూపించాలన్న ఆలోచన దర్శకుడికి రావడం గ్రేట్ అనే చెప్పాలి. ఈ పాత్రతో ఎమోషన్ ని, హాస్యాన్ని బాగా పండించాడు దర్శకుడు. బౌన్సర్ వృత్తి వెనుక ఎలాంటి కష్టాలు ఉంటాయో అనే పాయింట్ ని దర్శకుడు బాగా చూపించాడు. మగ బౌన్సర్ కేరెక్టర్ తో కథ రాసుకుని ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. లేడీ బౌన్సర్ కేరెక్టర్ తో కథ రాసుకుని మంచి ప్రయోగమే చేశాడు. లేడీ బౌన్సర్ జాబ్ ఉంటే వారి శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాన్ని దర్శకుడు బాగా చూపించాడు. అయితే కథలో పెద్ద దమ్ము లేదు. రొటీన్ లవ్ స్టోరీ కావడం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో సినిమా ఇంట్రస్టింగ్ గా అనిపించదు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బౌన్సర్ గా బాగా నటించింది.
మిగతా నటులు కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు. మనకి ఆ నటులు తెలియదు కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా మిల్కీ బ్యూటీ మీదే ఉంటుంది. అయినప్పటికీ తమన్నా మనల్ని సినిమా అయ్యే వరకూ కూర్చోబెడుతుంది. అయితే పాత్రలో సీరియస్ నెస్ ని చూపించి ఉంటే కథ ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. బబ్లీ పేరుకి తగ్గట్టు కేరెక్టర్ ని కూడా బబ్లీగానే డిజైన్ చేశాడు. సాంకేతిక వర్గం పని తీరుకొస్తే ఈ సినిమాకి హిమ్మన్ ధమిజ సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశాడు. గ్రామీణ అందాలను తన కెమెరా కళ్ళలో అద్భుతంగా చూపించాడు. తనిష్క్ బగ్చీ, కరణ్ మల్హోత్రా అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో వచ్చే పాటలకు అద్భుతమైన మ్యూజిక్ కొట్టారు. ఎడిటింగ్ వర్క్, ఆర్ట్ వర్క్ అన్నీ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.