Daggubati Venkateswara Rao: ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడుల మధ్య బంధుత్వం కంటే.. అంతకు మించిన స్నేహం బంధం ఉండేది. టీడీపీలో ఎన్టీరామారావు తర్వాత నెంబర్ 2, నెంబర్ 3గా చంద్రబాబు, దగ్గుబాటి ఉండేవారు. ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారు దగ్గుబాటి. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ సమయంలో కూడా ఇద్దరూ ఎంతో సఖ్యతగా ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఇద్దరి మధ్యా దూరం ఏర్పడింది. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు దేశం పార్టీనుంచి బయటకు వచ్చేశారు. తర్వాత భార్యతో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఇక అప్పటినుంచి నందమూరి కుటుంబంతో కలిసే ఉన్నా.. నారా వారితో మాత్రం దూరం జరిగారు. భువనేశ్వరీతో టచ్లో ఉన్నా.. చంద్రబాబును దూరం పెడుతూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో భువనేశ్వరి బీజేపీలో చేరగా.. 2019 ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన తన కుమారుడిని ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దింపాలని చూశారు. కానీ, అతడు అమెరికన్ సిటిజన్ కావడం.. సిటిజన్ షిప్ను రద్దు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడటంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీలో నిల్చారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారంటూ నేరుగా, సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు విమర్శలు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇటు వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాతినుంచి దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తోడల్లుడు చంద్రబాబుపై కూడా విమర్శలు చేయటం మానేశారు. ఈ నేపథ్యంలోనే 2021 డిసెంబర్లో జరిగిన ఓ కుటుంబ ఫంక్షన్లో ఇద్దరు తోడల్లుళ్లు కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మంగళవారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దగ్గుబాటిని చంద్రబాబు పరామర్శించారు. ఆయన సతీమణి పురంధేశ్వరిని, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దగ్గుబాటి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాసేపు దగ్గుబాటి దంపతులతో కలిసి ముచ్చటించారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు, వెంకటేశ్వరరావుల మధ్య ఎడబాటు తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు కుటుంబాలు కలిపిపోయాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కుటుంబ సఖ్యత.. రాజకీయ సఖ్యతగానూ మారుతుందా? తోడల్లుళ్లు మళ్లీ ఏకం అవుతారా? గతంలోలా కలిసి రాజకీయాలను శాసిస్తారా?... ఏమో వేచి చూడాల్సిందే.. మరి, చంద్రబాబు, దగ్గుబాటి కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. పరామర్శించిన చంద్రబాబు