రాజకీయాల్లో అయినా.. సినిమా రంగంలో అయినా సరే.. లైమ్ లైట్ లో ఉన్నంత వరకే గుర్తింపు ఉంటుంది. అందుకే అటు ఇండస్ట్రీ వారు.. ఇటు రాజకీయాల్లో ఉన్న నేతలు.. తమకు పాపులారిటీ ఉండగానే.. తన వారసులను తీసుకొచ్చి.. వారు నిలదొక్కుకునేంత వరకు వెన్నంటి ఉంటారు. వారసులు సెట్ అయ్యారు.. ఇక డోకా లేదు అనిపించాక.. వారు ఆయా ఫీల్డ్ ల నుంచి తప్పుకుంటారు. తాజాగా ఏపీలో ఓ కీలక మంత్రి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నారట. త్వరలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుని.. ఆ స్థానంలో తన కుమారుడిని తీసుకువచ్చి.. వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు సదరు నేత సన్నిహితులు తెలుపుతున్నారు. ఇంతకు ఎవరా నేత అనేది తెలియాలంటే.. ఇది చదవండి.
బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున, విభజన తర్వాత ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే ఆయనకు చివరి ప్రత్యక్ష ఎన్నిక అని బొత్స సన్నిహితులే చెబుతున్నారు. రాజకీయాలకు, వయసుకు పెద్దగా సంబంధం లేకపోయినా ప్రస్తుతమున్న రాజకీయాల నుంచి తప్పుకుంటేనే బెటర్ అని బొత్స సత్యనారాయణ భావిస్తున్నారట. తన సమకాలీకులు, తన కంటే వయసులో పెద్దవారు రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకుని.. తన వారసుడిని తెరపైకి తీసుకురావాలని బొత్స భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయన వల్లనే గతంలో కాంగ్రెస్ కాని, ప్రస్తుతం వైసీపీ కాని రాజకీయంగా రాణించగలిగింది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించారు. మంత్రి పదవి ఇచ్చారు. సీఎం జగన్ కి కూడా ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేదు. తనపై పార్టీలో ఇంత మంచి అభిప్రాయం ఉన్న సమయంలోనే తాను రాజకీయాల నుంచి తప్పుకుని.. తన వారసుడిని తెర మీదకు తెస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. బొత్స భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక తన కుమారుడు బొత్స సందీప్ ను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారట.
బొత్స సత్యనారాయణ తన వారసుడిని క్రియాశీలకంగా మారుస్తున్నారు. బొత్స సందీప్ మెడిసిన్ చదవినప్పటికి.. తండ్రి అడుగుజాడల్లోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొత్స సందీప్ సేవా కార్యకమ్రాలతో ముందుకు వెళుతున్నారు. డెవెలెప్ మెంట్ ఆఫ్ హెల్త్ , ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ వంటి వాటికోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ధీర పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలోనూ బొత్స సందీప్ విజయనగరం జిల్లాలో విశిష్ట సేవలందించారు. బొత్స యువసేనను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. మరి తండ్రి బొత్స రాజకీయ వారసత్వాన్ని సందీప్ నిలబెడతారా.. లేదా.. అన్నది రానున్న కాలంలో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.