ఇంటర్నేషనల్ న్యూస్- కేఎఫ్ సీ చికెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరుతుంది. అవును మరి కేఎఫ్ సీ చికెన్ అంత రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరకరలాడుతూ కరిగిపోతుందని చెబుతారు అంతా. అందుకే కేఎఫ్ సీ చికెన్ కు ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఎంతో ఇష్టంగా కేఎఫ్ సీ చికెన్ తింటారు.
అమెరికాకు చెందిన కేఎఫ్ సీ చికెన్ టేస్టీతో పాటు, హైజెనిక్ గా చికెన్ సంబందింత ఆహారాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఐతే ఈ క్రమంలో కేఎఫ్ సీ సిబ్బంది చేసిన పొరపాటుతో ఓ మహిళా కస్టమర్ షాక్ కు గురైంది. అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్ లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్ అనే మహిళ కేఎఫ్‌సీ టేక్ అవే బాక్స్‌ను ఆర్డరిచ్చి ఇంటికి తెప్పించుకుంది. ఇంకేముంది ఎంచక్కా వేడి వేడి చికెన్ తిందామని చికెన్ బాక్స్ ఓపెన్ చేయగా, అందులో ఏకంగా పిండి పూసిన కోడి తల కాయ వచ్చింది.
కొంత మేర ఉడికిన తల, కళ్ళు, ముక్కుతో ఉన్న కోడి తలను చూసి ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. కోడి తలకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. కేఎఫ్ సీ చికెన్ ద్వార ఇలా జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఆ మహిళ చెప్పింది. ఈ ఘటనపై కేఎఫ్ సీ చికెన్ కంపెనీ స్పందించింది.
ఈ ఫొటోను చూసి తాము ఆశ్చర్యపోతున్నామమని కేఎఫ్ సీ సంస్థ కామెంట్ చేసింది. మొత్తం కోడి తల ఎలా వచ్చిందో, ఈ పొరపాటు ఎలా జరిగిందో పరిశీలిస్తామని చెప్పుకొచ్చింది. ఈ తప్పు మళ్లీ జరగకుండా నివారిస్తామని కేఎఫ్ సీ పేర్కొంది. ఇక సదరు మహిళను కేఎఫ్‌సీ అధికారులు సంప్రదించి, ఆమెకు ఉచితంగా మరొక చికెన్ బాక్స్ అందించారు. అంతే కాదు తాము ఏవిధంగా కిచెన్‌లో చికెన్ ప్రిపేర్ చేస్తామో తనిఖీ చేసేందుకు రావాలని ఆ మహిళను ఆహ్వానించింది కేఎఫ్ సీ కంపెనీ.