ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా కాలేయ వ్యాదితో బాధ పడుతున్న రమేష్ బాబు ఆరోగ్యం శనివారం మరింత క్షీణించడంతో, గచ్చిబౌళిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఐతే అప్పటికే రమేష్ బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది.
అల్లూరి సీతారామరాజు చిత్రంలో రమేష్ బాబు యువ అల్లూరి పాత్రలో కనిపించి సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలో బాల నటుడిగా కనిపించారు. సామ్రాట్ చిత్రంతో రమేష్ బాబు హీరోగా మారారు. ఆయన మొత్తం 17 సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. ఐతే ఆ తరువాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
హీరోగా సినిమాలు చేయడం మానేసినా, తండ్రి పేరు మీదనే కృష్ణ ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు రమేష్ బాబు. మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. రమేష్ బాబు హీరోగా ప్రారంభమైన సాహస యాత్ర సినిమా ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆర్థిక కారణాలతో మధ్యలోనే ఆగిపోయింది. పెద్ద వంశీ దర్శకుడిగా కథా చర్చలు చేశారు. ఇదొక అడ్వెంచరస్ స్టోరి.
అప్పట్లో అరకు వెళ్లి రైటర్స్‌తో కూర్చుని వంశీ కథను కూడా రెడీ చేశారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఓ పాటను కూడా రికార్డ్ చేశారు. లొకేషన్స్ అంతా ఓకే అనుకుని షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. కానీ డైరెక్టర్ వంశీకి, నిర్మాతలకు వచ్చిన మనస్పర్ధల కారణంగా సినిమా ఆగిపోయింది. ఆ తరువాత నిర్మాతలు వెళ్లి సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. ఆయన దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్‌తో మాట్లాడి సినిమాను డైరెక్ట్ చేయడానికి ఒప్పించారు.
గౌతమి, రమ్యకృష్ణ, మహాలక్ష్మి హీరోయిన్స్‌గా ఎంపికయ్యారు. సంగీత దర్శకుడు ఇళయరాజా స్థానంలో రాజ్ కోటిని మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేశారు. రమేష్‌బాబు, గౌతమి, మహాలక్ష్మి లపై అండమాన్ లో రెండు పాటలను కూడా షూట్ చేశారు. ఈ సారి ఆర్ధిక సమస్యలతో సాహస యాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఆ తరువాత రమేష్ బాబు సినిమాల జోలికి పోలేదు.