హైదరాబాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంట్ కట్ చేసి దిమ్మతిరిగేలా చేసింది. రూ.కోటికి పైగా కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్ నిలిపివేస్తున్నట్లుగా ఏడీఈ బాలకృష్ణ మంగళవారం వెల్లడించారు.
విద్యుత్ బిల్లులు చెల్లించడంలో హెచ్‌సీఏ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, అలాగే విద్యుత్‌ను యధావిధిగా వాడుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాగా, హెచ్‌సీఏపై గతంలోనూ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈవిషయంపై హెచ్‌సీఏ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తీర్పు విద్యుత్తు శాఖకు అనుకూలంగా రావడంతో హెచ్‌సీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఇదీ చదవండి : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు.. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ
కోర్టు చెప్పినా హెచ్ సీఏలో మార్పు రాలేదని అధికారులు తెలిపారు. ఇటీవలే విద్యుత్ అధికారులు బకాయిల విషయంపై నోటీసులూ జారీ చేశారు. అయినా, చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేసినట్లు తెలిపారు. తక్షణమే బిల్లులు కట్టాలని లేదంటే అప్పటి వరకూ కరెంట్ నిలిపివేస్తామని అధికారులూ పేర్కొన్నారు.