ఐఏఎస్ కి ఉండే అధికారాలు, వారికి ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి అందరికి తెలిసిందే. అలాంటి ఐఏఎస్ అధికారి వివాహం అంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వారు తలచుకుంటే పెళ్లిని అంగరంగ వైభవంగా బంధువుల కోసం పెద్ద పెద్ద ఏసీ బస్సులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే.. ఓ ఐఏఎస్ అధికారి మాత్రం తన పెళ్లికి ఆర్టీసీ బస్సును ఉపయోగించి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన ఈ పనికి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన సురేశ్, నిర్మల దంపతుల కుమారుడు మకరందు. చిన్నతనం నుంచి ఆదర్శ భావాలతో చదువుకొని 2020లో సివిల్స్ కు ఎంపికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో మకరందు.. ఇటీవలే కరీంనగర్ కు చెందిన సాయి తేజిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని, హైదరాబాద్ శివారులోని ఓ కన్వెన్షన్ హాల్ లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి వరుడితో సహా అతడి కుటుంబీకులు, బంధువులు.. ఏసీ, లగ్జరీ బస్సులలో కాకుండా ఆర్టీసీ బస్సులో కళ్యాణ మండపానికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పెళ్లి కోసం సిద్దిపేట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు బుక్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ కలెక్టర్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తన పెళ్లి కోసం ఆర్టీసీ బస్సును ఉపయోగించిన కలెక్టర్ మకరందుని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా అభినందించారు. ఈ వివాహానికి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే పెళ్లి పత్రిక విషయంలో కూడా కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పర్యావరణ సంరక్షణ కోసం విత్తనాలతో కూడిన కాగితపు పెళ్లి కార్డును స్నేహితులు, సన్నిహిత అధికారులకు అందించారు.
ఆ పెళ్లి పత్రిక విశేషం ఏంటంటే.. దాన్ని భూమిలో వేస్తే మొక్కగా ఎదుగుతుంది. దీంతో పాటు పోచంపల్లి చేనేత వస్త్రంతో మాస్కులు కుట్టంచి ఇవ్వడం, వివాహానికి ఆర్టీసీ బస్సును ఉపయోగించిన ఈ యువ కలెక్టర్ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి వృత్తిలోనే కాకుండా తన పెళ్లి విషయంలో కూడా బాధ్యతను చాటుకున్న కలెక్టర్ మకరందు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#IChooseTSRTC
Privileged to bless the newly weds
Mr.Makarandu & Ms Tejitha, IASProbationer on behalf of TSRTC & VC &MD Sri.VCSajjanar IPS. Thanked him for choosing TSRTC for Guests’ conveyance @tsrtcmdoffice @TSRTCHQ @AjayPuvvada @Govardhan_MLA @SomeshKumarIAS pic.twitter.com/HkEuTNHKuX— Vinod ED Engg TSRTC (@EDEnggTSRTC) February 11, 2022