పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లానాయక్’ నుంచి టైటిల్ సాంగ్ విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటతో పవన్ క్రేజ్ ఎంటో మరోసారి రుజువైంది. అంతేకాదు, ఈ పాటతో పవన్‌కు జానపదం, సంప్రదాయ కళలపై ఉన్న అభిరుచి మరోసారి అందరికీ తెలిసింది. ‘ఆడాగాదు, ఈడాగాదు, అమీరోళ్ల మేడాగాదు పుట్టిండాడు పులిపిల్ల సెభాష్’ అన్న సాకి మీరు విన్నారు కదా.. ఆ సాకిని అంత చక్కగా పాడింది ఎవరో కాదు ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు ‘దర్శనం మొగిలయ్య’. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నాడు ఈ జానపద కళాకారుడు.
నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకులకు చెందిన దర్శనం మొగిలయ్య తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే కాలం గడుపుతున్నాడు. ఈ కిన్నెరను వాయించేది ఈ మొగిలయ్య ఒక్కడే. ప్రస్తుతం దీన్ని వాయించేవారు ఎవరూ లేరని చెప్తున్నారు. తనకు తొమ్మిది మంది సంతానం.. వారిలో నలుగురు కాలం చేశారు. ఎవరూ ఈ కళ నేర్చుకోలేదని తెలిపారు. ఈ కళ తనతోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని దర్శనం మొగిలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వతహాగా దినసరి కూలిగా జీవితం వెళ్లదీస్తున్న దర్శనం మొగులయ్య ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరియచం చేస్తుంటాడు. ఆయన పాడే మీయాభాయ్ పాటను విని దానికి తగ్గట్లుగా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌ను రచించాడు రామజోగయ్యశాస్త్రి. ఈ పాట మొత్తం భీమ్లానాయక్ జననం ఎలా జరిగింది. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అన్న విషయాలను మొగిలయ్య గాత్రం ద్వారానే అందించారు. ఇలా పవన్ కల్యాణ్ సినిమాలో పాట పాడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మొగిలయ్య తెలిపారు.
12 మెట్ల కిన్నెరని తన తాత ముత్తాతలే తయారు చేశారని చెప్తుంటాడు దర్శనం మొగిలయ్య. దానిని తయారు చేయడానికి సొరకాయ బుర్రలను వినియోగించారు. దానిని తయారు చేసే వ్యక్తి కూడా తానొక్కడే అని చెప్తున్నాడు. మొదట తనకు అందినప్పుడు దానికి 11 మెట్లు మాత్రమే ఉన్నాయని.. దానిని 12 మెట్లకు పెంచినట్లు తెలిపాడు. అంతకు మించి పెంచకూడదని తన తండ్రి తనకు చెప్పినట్లు మొగిలయ్య తెలిపాడు. కిన్నెరంటే తనకి ప్రాణమని తన మానసపుత్రికగా అభివర్ణిస్తుంటారు. కిన్నెరను ఎంతో చక్కగా అలంకరించారు.
‘పాట పాడటం కోసం చెన్నై తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ చాలా సింపుల్‌గా తెల్ల పంచ కట్టుకుని దర్శనం మొగిలయ్య గారు నమస్తే అంటూ వచ్చి పలకరించారు. నా కిన్నెర తీసుకుని చాలా బాగా వాయిస్తుంటారు మీరు’ అంటూ మాట్లాడినట్లు మొగిలయ్య తెలిపారు. పవన్ కల్యాణ్ సినిమాలో పాట పాడటం ఆయనను కలవడం, కలిసి ఫొటో దిగడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తనకు తగిన గౌరవం దక్కిందని దర్శనం మొగిలయ్య తెలిపారు. తన కళను గుర్తించి సీఎం కేసీఆర్ ఉగాది పురస్కారం అందించడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. తనకు ప్రస్తుతం నెలకు రూ.10 వేలు ఆర్థికసాయం భత్యం అందుతున్నట్లు వివరించారు. దర్శనం మొగిలయ్య కళను అంతరించిపోనివ్వమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఎలా ఇప్పటి వరకు సాంప్రదాయ కళలను కాపాడుకుంటున్నామో మొగిలయ్య కళను కూడా అంతరించి పోకుండా చూస్తామని తెలిపారు. దర్శనం మొగిలయ్యకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తన పక్కా ఇల్లు కూడా ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.