Land And House: ఎకరం భూమి ఉంటే చాలు అనుకునే జమానా ఇది. కానీ, 60 రూపాయలు కేవలం 60 రూపాయలకే తమ 11 ఎకరాల భూమి, ఇల్లుని సొంతం చేసుకుంది ఓ ఫ్యామిలీ. 58 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ఆ ఆస్తి వారసులకు దక్కింది. మరి, ఆ 58 ఏళ్ల స్టోరీ ఏంటీ? ఏం జరిగింది?.. రంగారెడ్డి జిల్లా మొమిన్‌పేట్ మండలం బూరుగుపల్లిలోని 124, 128 (2) సర్వే నంబర్లలోని వ్యవసాయ భూమిని, ఇంటిని రామాగౌడ్ అనే ఎక్సైజ్ కాంట్రాక్టర్ కల్లు దుకాణం సెక్యూరిటీ కింద ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ఆయన ప్రభుత్వానికి 3,393 రూపాయలు బకాయిలు పడ్డారు. ఈ బాకీని వసూలు చేసుకునేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్-1864 ప్రకారం తాకట్టు పెట్టిన ఆస్తిని ప్రభుత్వం వేలానికి పెట్టింది. 1958లో మొత్తం ఆస్తిని 2,725 రూపాయలకు మొదటిసారి వేలం నిర్వహించగా వేలంలో ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన బిడ్డర్ డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు.
దీంతో 1964లో రూ. 7 వేలకు రెండోసారి వేలం నిర్వహించగా.. అప్పుడు కూడా మొత్తం కోట్ చేసిన బిడ్డర్లు వేలం సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారు. భూమిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ నంబర్ 45’ కింద ప్రొసీడింగ్స్ జారీ చేసి, మొత్తం సాగు భూమిని 10 రూపాయలకు, ఇంటిని 50 రూపాయలకు, అలా మొత్తం కలిపి 60 రూపాయలకు ఆ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూమి స్వాధీనం, వేలానికి సంబంధించి వారసులైన పిటిషనర్లు కె.అంజయ్య, కె. నరహరికి ఎలాంటి నోటీసులు జారీచేయలేదు. అప్పటి ప్రభుత్వం బకాయిల మొత్తాలు చెల్లిస్తే వడ్డీ, పెనాల్టీలు రద్దు చేస్తామని ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పిటిషనర్లు 1996లో 3,400 రూపాయల్ని చలాన్ ద్వారా ప్రభుత్వానికి చెల్లించారు.స్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వం ఇతరులకు కేటాయించిందని తెలుసుకున్న పిటిషనర్లు 2001లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. స్వాధీనం చేసుకున్న భూమిలో తొమ్మిదెకరాలను ఇతరులకు కేటాయించినందున మిగిలిన రెండు ఎకరాలను పిటిషనర్లకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి అంగీకరించని పిటిషనర్లు మొత్తం 11 ఎకరాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు విరుద్ధంగా భూమిని వేలానికి పెట్టారని.. అసలు భూమిని వేలానికి పెట్టడమే చట్ట విరుద్ధం అని కోర్టు ఆక్షేపించింది. ఈ క్రమంలోనే స్వాధీనం చేసుకున్న భూమిని ఇతరులకు చేసిన కేటాయింపులను..
అనంతరం సదరు భూములకు సంబంధించి జరిగిన మొత్తం క్రయవిక్రయాలను, సేల్‌డీడ్స్‌ను కోర్టు కొట్టేసింది. మొత్తం భూమిని, ఇంటిని సదరు ఆస్తికి వారసులైన పిటిషనర్లకు అప్పగించాల్సిందేనని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 58 ఏళ్లు పోరాడారు. ఎట్టకేలకు నెగ్గారు. ఆస్తులను చేజిక్కించుకున్నారు. 60 రూపాయలకే 11 ఎకరాలతో పాటు ఇంటిని సొంతం చేసుకున్నారు. తమ వారసత్వంగా వస్తున్న ఆస్తులను ప్రభుత్వం తక్కువ ధరకే స్వాధీనం చేసుకుందంటూ కోర్టును ఆశ్రయించారు. న్యాయం వస్తుందని 58 ఏళ్లు ఎదురు చూశారు. వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ ఎకరం ధర కోటి రూపాయల దాకా పలుకుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బీజేపీ MLA రఘునందన్ రావుపై RGV ట్వీట్ వైరల్!