హైదరాబాద్- వాళ్లు తెల్లారి లేస్తే ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పిస్తారు. అవకాశం దొరికితే చాలు ఆరోపణలు చేస్తారు. ఇక సీఎం ఐతే వాళ్ల పేరు చెబితే చాలు ఇంతెత్తున లేస్తారు. వాళ్లను ముఖ్యమంత్రి తిట్టే తిట్లు మనం ఇప్పుడు చెప్పుకోలేం కూడా. అలాంటిది సీఎం వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇప్పుడు అందికి ఆశ్చర్యంగా ఉంది. అవును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ వచ్చాక మొట్టమొదటి సారి కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ప్రగతి భవన్ లో కలిశారు. అయితే ఈ భేటీ రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఖమ్మం జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ విషయమై ముఖ్యమంత్రి కసీఆర్ ను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. మరియమ్మ లాకప్ డెత్ ఘటనను సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరియమ్మ కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అంతే కాకుండా మరియమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని కూడా సీఎం కేసీఆర్ చెప్పారని భట్టి పేర్కొన్నారు.
ఇక మరియమ్మ కుటుంబానికి ఇల్లు ఇవ్వాలని సీఎం ను కోరామని ఆయన చెప్పారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని భట్టి తెలిపారు. లాకప్ డెత్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. తెలంగాణలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. 28వ తేదీలోగా మరియమ్మ కుటుంబానికి అన్నిరకాల సాయం చేసేందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రేపు డీజీపీని మరియమ్మ స్వగ్రామానికి వెళ్లాలని ఆదేశిస్తామని సీఎం తెలిపారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.