హైదరాబాద్- ప్రశాంత్ కిషోర్.. ఈ రాజకీయ వ్యూహకర్తకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ పార్చీ నుంచి మొదలు చాలా ప్రాంతీయ పార్టీలకు వ్యూహాలు రచించారు ప్రశాంత్ కిషోర్. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ కి వ్యూహాలు రచించి, వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు ప్రశాంత్ కిషోర్. అలా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తెచ్చారాయన.
అందుకే ప్రశాంత్ కిషోర్ కు దేశ రాజకీయ వర్గాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇదిగో ఇటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ సేవలను తెలంగాణలో టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ బృందంతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ బుధవారం కూడా ప్రగతిభవన్ లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ కీలక బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐ ప్యాక్ సర్వే బృందంగా చెబుతున్న వారితో జరిగిన సమావేశంలో, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తి చూపుతున్నారట.
టీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అంశాలు, పార్టీ యంత్రాంగం పనితీరు వంటి వాటిపై ఐ ప్యాక్ ద్వారా సర్వే చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.