హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. రైతు బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 28 నుంచి రైతు బంధు సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లతో జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, కలెక్టర్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రగతి భవన్ లో సుదీర్గంగా జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగుల విభజన, దళిత బంధు, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలంలో వేసే పంటల వంటి పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్, న్యూ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి, పోడు భూముల సమస్యలపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఈ నేపధ్యంలోనే ఈనెల 28 వ తేదీ నుంచి రైతు బంధు పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొత్తం పది రోజుల్లోనే రైతులందరికి రైతు బంధు అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధుకు సంబందించిన నగదు జమకానుంది. గతంలో మాదిరిగానే భూమి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ నగదు జమచేయనున్నారు.
ముందు ఒక ఎకరం లోపు భూమి ఉన్న రైతుల నుంచి మొదలు పెట్టి ఎక్కువ భూమి ఉన్న వారి వరకు రైతు బంధు నగదును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ అధికారులు రైతుల వివరాలను వ్యవసాయ శాఖకు అందించారని తెలుస్తోంది. పంటలు వేసే సమయంలో తెలంగాణ సర్కార్ రైతు బంధు నగదును అందిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.