నిజామాబాద్- రోడ్డు మీద పడి ఉన్న సంచులను చూసి మొదట కంగారు పడ్డారు. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యారు. ఆ వెంటనే నిరాశకు లోనయ్యారు. ఇంతకు ఆ సంచుల్లో ఏం ఉంది అంటే.. కొత్త ఐదు వందలు, 2 వేల రూపాయల నోట్లు. అబ్బ రోడ్డు మీద సంచుల నిండా డబ్బు దొరికింది.. ఇంటికి ఎత్తుకుపోదామనుకున్న వారికి తీరని నిరాశ ఎదురయ్యింది. ఎందుకంటే అవి కత్తిరించిన నోట్ల ముక్కల సంచులు. వీటిని చూసిన జనాలు.. డబ్బులను ఇలా కత్తిరించడానికి వీరికి చేతులు ఎలా వచ్చాయో అని వాపోతున్నారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
కొత్త 500, 2000 నోట్లను ముక్కలుగా చేసి సంచుల్లో నింపారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్లే దారిలో రోడ్డు మీద ఈ సంచులు దర్శనమిచ్చాయి. నోట్ల ముక్కల సంచులపై నుంచి వాహనాలు వెళ్లడంతో చెల్లా చెదురుగా రోడ్డుపై ఎగిరి పడ్డాయి. రవాణా చేస్తుండగా వాహనంలో నుంచి పడి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏఎస్సై మురళీధర్ సిబ్బందితో వెళ్లి వాటిని పరిశీలించారు. శాంపిళ్లను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. బుస్సాపూర్ వద్ద జాతీయ రహదారి పక్కన ఆరేళ్ల కిందట కూడా ఇలాంటి నోట్ల ముక్కలే పడేశారు. ఒకే గ్రామంలో రెండు సార్లు కరెన్సీ నోట్ల ముక్కలు పడి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరెన్సీ ముక్కలను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో తెలుసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.