ఉగాది పండగ వేళ తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ తిరుపత్తూర్ వద్ద ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మృతులంతా పులియూర్ గ్రామస్తులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని గుడి వద్ద ప్రార్థనలు చేసేందుకు వీరంతా ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, ప్రమాదంలో మరణించినవారికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50,000 సాయం ప్రకటించారు.