ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయ్యింది. కొంత మంది ఫోన్లు కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా ఒక ఎంటర్ టైన్ మెంట్ వస్తువుగా పరిగణిస్తున్నారు. ఎక్కువ శాతం ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువ కావడంతో ఎవరైనా బాధితులు వచ్చినపుడు ఎంతో అసౌకర్యానికి గురి అవుతున్నారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసు పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణియమ్ నేతృత్వంలోని బెంచ్ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
తిరుచిరాపల్లి హెల్త్ రీజనల్ వర్క్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓ అధికారి విధి నిర్వహణలో ఉండగానే… ఆఫీసులోనే తోటి ఉద్యోగుల వీడియో తీశాడట. ఉద్యోగులు ఎంతగా వారించినా కూడా సదరు అధికారి వినలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు ఆ అధికారిని సస్పెండ్ చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేయాలని కోరుతూ ఆ అధికారి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రహ్మణియమ్ ఈ తీర్పు చెప్పారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫీసుల్లో అది కూడా విధి నిర్వహణలో ఉండగా.. ఫోన్లలో మాట్లాడటం, వీడియోలు, ఫొటోలు తీయడం ఇతర ఉద్యోగులకు ఇబ్బంది కలిగించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయమూర్తి అన్నారు. పనిచేస్తున్నపుడు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్‌ను స్విచాఫ్ చేయాలని.. లేదంటే సైలెంట్ లో గానీ వైబ్రేషన్‌లో గానీ పెట్టాలని సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి లో మాట్లాడాలీ అంటే పై అధికారి అనుమతి తీసుకుని ఆఫీస్ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడి రావాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతే కాదు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది.