కొంతమంది మహిళలకు మగవారిలానే మూతి మీద, గడ్డం మీద, చెంపల పైన వెంట్రుకలు మొలుస్తాయి. ఆ వెంట్రుకలు కనబడకుండా ఉండేందుకు థ్రెడింగ్ ట్రీట్మెంట్ అని, హెయిర్ రిమూవల్ క్రీములని ఏవేవో అప్లై చేసి అందంగా కనబడాలని అనుకుంటారు. మగవారిలా ముఖం మీద వెంట్రుకలు కనబడితే సమాజంలో తలెత్తుకోలేమని ఫీలవుతూ ఉంటారు. కానీ ఓ మహిళ మాత్రం మీసాలతోనే తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది. ఆ మీసమేంటి అసహ్యంగా అని తిట్టినా, ఎగతాళి చేసినా డోంట్ కేర్ అని అంటోంది. కేరళలోని కణ్ణూర్ జిల్లాకు చెందిన షిజకు.. అయిదేళ్ల వయసు నుండే మూతి మీద మీసం మొలవడం ప్రారంభించింది. సాధారణంగా ఆ వయసులో అబ్బాయిలకే మీసాలు మొలవవు. అలాంటిది ఈమెకు మీసం మొలిచింది. అలా అని ఆమె అందరిలా వెంట్రుకలు తొలగించుకోవాలని ఏనాడూ అనుకోలేదు. మీసాన్ని అలానే ఉంచుకోవాలని అనుకుంది. మీసం వల్ల తానెప్పుడూ అందంగా లేనని అనుకోలేదట. చాలామంది ఆ మీసాన్ని తీసేసుకోమని సలహాలిచ్చారట. కానీ, షిజ మాత్రం వారి మాటలను లెక్కచేయదట. ఈ మీసంతోనే ఆమె దర్జాగా బయటకు వెళ్తానని, రాత్రి కూడా భయం లేకుండా దుకాణాలకు వెళ్తానని ఆమె వెల్లడించింది. ముఖంపై వెంట్రుకలు మహిళల అందాన్ని చెడగొడతాయని, వాటిని తొలగించుకోవాలన్నది చాలా మంది మహిళలు అభిప్రాయపడుతుంటారు. వెంట్రుకలు మొలిస్తే, ఏదో ప్రాణం పోయినట్టు ఫీలవుతారని అనుకుంటారు. వీళ్ళ బలహీనతను క్యాష్ చేసుకుని కొన్ని కంపెనీలు రకరకాల ఉత్పత్తులను మార్కెట్లో దించుతున్నాయి. హెయిర్ రిమూవల్ క్రీములు, రేజర్లు, ఎపిలేటర్స్, వాక్స్ స్ట్రిప్స్ లాంటి ఎన్నో సాధనాలు మార్కెట్లో వచ్చాయి. కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పెద్దగా వీటి గురించి పట్టించుకోవడం లేదు. తమ ముఖం మీద వెంట్రుకలు ఉంటే ఏమైంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. షిజలా మీసం పెంచుకునేందుకు గర్వపడుతున్నారు. ఇక మీసం లేకుండా తనను తాను ఊహించుకోవడం కష్టమని షిజ అంటోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూసి కొందరు ప్రశంసించగా, మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. అయితే, పొగిడినా, తిట్టినా తనేం పట్టించుకోనని ఆమె చెబుతోంది. మీసాలు ఉంచుకోవాలా? తీసేయాలా? అన్నది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆమె వెల్లడించింది. తన భర్త, కుటుంబ సభ్యులు ఎవరూ కూడా తన మీసం పట్ల అభ్యంతరం వ్యక్తపరచడం లేదని, అలాంటప్పుడు సమాజం గురించి ఎందుకాలోచిస్తానని ఆమె అంటోంది. కాగా 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త ‘హర్నామ్ కౌర్’ అనే సిక్కు మహిళ.. నిండుగా గడ్డం పెంచిన అతి చిన్న వయస్కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. తనను తాను ప్రేమించుకోవడం, నేర్చుకోవడానికి ముఖ వెంట్రుకలను అంగీకరించడం ఎంతో ముఖ్యమని హర్నామ్ కౌర్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇలా కొంతమంది మహిళలు ఇప్పుడు మీసాలు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు. ముఖం మీద వెంట్రుకలు ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. షిజ ఇంత ఆత్మవిశ్వాసంతో ఉండడానికి కారణం తాను ఎదుర్కున్న సమస్యలే. ఆమెకు ఆరు సర్జరీలు జరిగాయి. వక్షోజాల్లో గడ్డ, అండాశయంలో తిత్తి తొలగించేందుకు సర్జరీలు చేయాల్సి వచ్చింది. అయిదేళ్ల క్రితం ఆమెకు గర్భాశాయం తొలగించారు. అదే ఆమె చేయించుకున్న చివరి సర్జరీ. ఈ సర్జరీతో ఆమె.. ఇక లైఫ్ లో ఆపరేషన్ గదిలోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకుంది. ఇక కేరళ ఎంత అభివృద్ధి పధంలో దూసుకెళ్తున్నా ఇంకా అక్కడ పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోందని ఆమె అంటోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించడం లేదా ఒంటరిగా జీవించడం అక్కడ వ్యవస్థ ఒప్పుకోదని ఆమె వెల్లడించింది. షిజకు పెళ్లయి, భర్తతో తమిళనాడు వెళ్లిన తర్వాత గానీ ఆమెకు స్వేచ్ఛ రాలేదని ఆమె అన్నది. దుకాణానికి నడిచి వెళ్లి కావలసిన సరుకులు స్వయంగా తానే తెచ్చుకుంటానని, రాత్రయినా ఒక్కదాన్నే దుకాణానికి వెళ్లినా ఇక్కడ ఎవరూ పట్టించుకోరని ఆమె అంటోంది. సొంతంగా తన పనులు చేసుకోవడం తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని షిజ చెప్తోంది. తాను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, అయితే బతికినంత కాలం నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగష్టులో 13 రోజులు బ్యాంకులు క్లోజ్! ఏయే రోజు అంటే.. ఇది కూడా చదవండి: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. గవర్నర్ తమిళిసై వైద్యం!