సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత సెలబ్రెటీలకు ఇన్‌స్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ రావడం.. అది చూసి ఫ్యాన్స్ గొప్పగా పొంగిపోవడం చూస్తున్నాం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నాలుగు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.. అలా అని ఆమె సినీ తారనో, గొప్ప మోడల్ కూడా కాదు. ఓ ఐపీఎస్ ఆఫీసర్.. అందరూ ఆమెను లేడీ సింగం అని పిలుస్తుంటారు. ఆమె పేరే అంకిత శర్మ ఐపీఎస్. ఆ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు. ఓర్పు, పట్టుదలతో కష్టపడి పని చేస్తేనే ఎవరైనా విజయాల మెట్లు ఎక్కగలరు. విజయం ఎల్లప్పుడూ గొప్ప శక్తి, బాధ్యతతో వస్తుంది. అంకిత శర్మ ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తొలి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లా ఏఎస్పీగా శర్మ నియమితులలైన తర్వాత ‘ఆపరేషన్ బస్తర్’కి నాయకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వం అంకితశర్మకి అప్పగించడానికి కారణం ఆమె శక్తిసామర్థ్యాలపైన నమ్మకమే.
చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ అనే కుగ్రామంలో పుట్టి పెరిగింది అంకిత. ముగ్గురు ఆడపిల్లలున్న కుటుంబంలో పుట్టిన ఆమె ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. భిలాయ్‌లో ఎంఏ, ఎంబీయే పూర్తిచేసిన తర్వాత సొంతంగా సివిల్స్‌కి సిద్ధమయి ఐపీఎస్ సాధించారు. అంకితా శర్మ 2018 సంవత్సరంలో తన మూడవ ప్రయత్నంలో విజయం సాధించింది. ఇదే సంవత్సరం యూపీఎస్ సి పరీక్షలో 203వ ర్యాంక్ సాధించింది. రాయ్‌పూర్‌లో సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా అడుగుపెట్టిన తర్వాత కరడు గట్టిన నేరస్తుల పించం అణిచారు. నేరాలని అదుపు చేయడంలో చొరవ చూపించారు. అంతే కాదు 2020లో, గణతంత్ర దినోత్సవం సందర్భంగా, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తన ట్రైనీ కాలంలో శర్మ పరేడ్‌కు నాయకత్వం వహించారు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఒక మహిళా అధికారి పోలీస్ బృందాన్ని నడిపించడం ఇదే ప్రథమం.
ప్రస్తుతం ఆపరేషన్ బస్తర్‌లో భాగంగా ఆమె పోలీసులతో దట్టమైన అడవుల్లో ఎన్నో వ్యవప్రయాసలకు ఓర్చి ముందుకు సాగుతున్నారు. అందుకే ఆమెను లేడీ సింగం అని పిలుస్తుంటారు. అంకిత శర్మ గురించి తెలిసిన ప్రముఖ సినీ నటి రవీనాటాండన్ ‘నిజమైన హీరోయిన్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. సాధారణంగా అంత గొప్ప పొజీషన్ లో ఉండి.. ఎప్పుడూ పోలీస్ విధుల్లో బిజీగా ఉండే అంకిత శర్మ ఆదివారం మాత్రం పెద్ద బాధ్యతనే భుజాన వేసుకుంటారు. పేదరికంలో ఉంటూ.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే వారికి స్ఫూర్తి నింపుతుంటారు. యూపీఎస్సీ పరీక్షలకు హాజరవ్వాలనుకునేవారికి ఆమె ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తుంటారు. ఖర్చు పెట్టి కోచింగ్‌కి వెళ్లలేని పాతికమంది విద్యార్థులకు ఆమె సివిల్స్ పాఠాలు చెబుతున్నారు.
గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు మరెవరూ పడకూడదని ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేజర్ వివేకానంద శుక్లాని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆయన ఉద్యోగరీత్యా జమ్మూకశ్మీర్, ఝాన్సీ, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ కొంత కాలం ఉన్నారు. బైక్ రైడ్, గుర్రపుస్వారీని, బ్యాడ్మింటన్ క్రీడను అంటే అంకిత శర్మ ఎంతో ఇష్టపడుతుంటారు. ఆ పోస్టులని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతారు. వాటితోపాటు సామాజిక స్ఫూర్తిని నింపే ఎన్నో పోస్టులనూ పెడుతుంటారు. అందుకే ఆమె ఓ గొప్ప సెలబ్రెటీ రేంజ్ కి చేరుకున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.