ప్రముఖ ల్యాప్‌ట్యాప్ కంపెనీ ‘ఏసర్’ ఇండియా యూజర్లను భయాందోళనకు గురిచేసే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏసర్ ఇండియా కంపెనీ సర్వర్లపై సైబర్ టీమ్ అటాక్ జరిగినట్లు జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది. 50 జీబీ వరకు యూజర్ డేటా చోరీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ అటాక్ చేసిందే మేమే అంటూ ‘డెసర్‌డెన్’ హ్యాకర్ల బృందం ప్రకటించుకుంది. అదే నిజమైతే ఎంతో మంది భారతీయ యూజర్ల క్రెడెన్షియల్స్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లే అవుతుంది. హ్యాక్ జరిగిందనడానికి ఇదే సాక్ష్యం అంటూ హ్యాకర్ల ఫోరమ్‌లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ డేటా లీక్‌లో 10 వేల మంది కస్టమర్లు, 3 వేల మంది రిటైలర్ల డేటా చోరీకి గురైనట్లు సమాచారం.
గతంలోనూ ఏసర్ కంపెనీ సర్వర్లపై సైబర్ దాడి జరిగినట్లు కథనాలు వచ్చాయి. ఈ ఏడాది మార్చిలో ర్యాన్సమ్ వేర్ వారు సైబర్ దాడి చేసి డేటా తిరిగి ఇచ్చేందుకు 50 మిలియన్ డాలర్లు డిమాండ్ చేసినట్లు.. అందులో 10 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు కంపెనీ సిద్ధమైనట్లు కూడా చెప్పుకొచ్చారు. ఆ దాటికి సంబంధించి కంపెనీ ఏం చేసిందని.. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఏసర్ ఇండియాపై అటాక్ జరిగిందన్న వార్తలపై ZDNet అనే వార్తా సంస్థతో ఏసర్ కంపెనీ స్పోక్స్‌పర్సన్ మాట్లాడినట్లు తెలిపింది. ZDNet కథనం ప్రకారం ఏసర్ కంపెనీ ఇండియా సర్వర్లపై జరిగిన దాడిని ఒప్పుకున్నట్లు తెలిపింది. ఆ కంపెనీకి చెందిన వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం ‘హ్యాకర్ దాడి వల్ల ఎఫెక్ట్ అయిన భారతీయ కస్టమర్స్‌ను గుర్తించాం. సైబర్ దాడికి సంబంధించి లోకల్ అథారిటీకి ఫిర్యాదు చేశాం. ఇండియన్ కంప్యూటర్ రెస్పాన్స్ టీమ్ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లాం. మా వ్యాపారంపై దీని ప్రభావం ఉండదు’ అంటూ ఆ కంపెనీకి చెందిన వ్యక్తి ప్రకటించినట్లు తెలిపారు. మరోవైపు హ్యాకర్లను కూడా సంప్రదించినట్లు కథనంలో వెల్లడించారు. ‘ప్రస్తుతానికి ఇండియా సర్వర్లలో వారికి యాక్సెస్ లేదు’ అని ప్రకటించినట్లు తెలిపారు.