రైతే దేశానికి వెన్ను ముక్క అంటూ రాజకీయ నేతలు గొంతుల పగిలేలా అరస్తున్నా వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉంటున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది రైతులు ఉరి తాడుకు వేలాడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చివెళ్తున్నారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినా చట్టాల వల్ల న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు మార్కెట్ లోనే పంటను వదిలేసి వెళ్తున్నారు.
అలా పండించిన పంట పారబోయకుండా సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆ యువతి తీసుకున్న నిర్ణయంతో అనేకమంది రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన కీర్తిప్రియ బిట్స్ పిలానీలో బీఫార్మసీ చేసి తర్వాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ చదివింది. ఇలా ఎన్నో ఉన్నత చదువుల చదివిన కీర్తి ప్రియ రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని కూడా పొందింది. కానీ ఆమె మనసులో మాత్రం ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపించింది.
ఇలా కాదనుకుని భారీ ప్యాకేజీని వదులుకుని కీర్తిప్రియ సొంతూరికి పయనమైంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. మంచి ఉద్యోగాన్ని వదిలి ఇక్కడేం చేస్తుందని ఎంతో మంది తిట్టిపోశారు. జనాల మాటలకు ధీటుగా సమాధానమిస్తూ రైతుల మేలు కోసం ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టింది ఆ యువతి. కీర్తిప్రియ వ్యవసాయం కుటుంబంలో జన్మించడంతో రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కట్టినట్లుగా తెలిసేవి. ఇదే కాకుండా మార్కెట్ లో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అక్కడే పంటను వదిలేసిన రైతుల కష్టాలను తెలుసుకుంది. వీటన్నటికీ సరైన మార్గం ఒకటేనంటూ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను ప్రారంభించి స్థానికంగా ఉండే రైతులకు తీపి కబురును అందించింది.సరైన ధరకే రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ లో డ్రై ఫ్రూట్స్, డ్రై వెజిటెబుల్స్ గా మార్చి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈ వ్యాపారంలో కీర్తి ప్రియ ప్రస్తుతం 10 రకాల పండ్లను, 20 రకాల కూరగాయలు టు-కుక్, రెడీ -టు-ఈట్ ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా స్థానికంగా ఉండే వ్యక్తులకు ఉపాధిని కూడా కలిపిస్తూ కీర్తిప్రియ అందరి మన్ననలు పొందుతుంది. ఒక ఎకరం స్థలంలో రూ.1.36 కోట్లతో కీర్తిప్రియ ప్రారంభించిన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ కు మంచి గుర్తింపుకు లభించింది.
ఎంతో మంది రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రోడ్డున పారవేస్తున్నారని అలాంటి రైతన్నల కోసమే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశానంటూ కీర్తిప్రియ తెలిపింది. తాను స్థాపించిన ఈ సంస్థ ద్వారా స్థానికంగా ఉండే యువతకు ఉపాధి కల్పించాలనే కోరిక కూడా తీరిందంటూ కీర్తిప్రియ చె్పుకొచ్చింది. రైతుల బాధలను దగ్గరి నుంచి చూసి చివరికి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా సరైన ధరకే పంటలను కొంటున్న కీర్తిప్రియ సేవలపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.