సాధారణంగా కవలలు నిమిషాల తేడాతో జననం జరుగుతుంది. దీంతో ఇద్దరూ ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటారు. కవలలు 15 నిమిషాల తేడాతో జన్మించారు.. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవడం సర్వసాధారణం. కానీ ఆ 15 నిమిషాల తేడాతో ఆ కవలల పుట్టిన తేదీలే కాదు .. ఏకంగా సంవత్సరాలే మారిపోయాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ అరుదైన ఘటన జరిగింది. కవల పిల్లలు 15 నిమిషాల తేడాతో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. కవలలిద్దరూ వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినరోజు జరుపుకోనున్నారు.
వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని గ్రీన్ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్కు డిసెంబర్ 31న పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. అదే రోజు రాత్రి 11.45 గంటలకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. 15 నిమిషాల అనంతరం 12.00 గంటలకు ఆడ శిశువు జన్మించింది. అంటే మగశిశువు 2021లో డిసెంబర్ 31న పుట్టగా, పాప 2022 జనవరి 1న జన్మించినట్లయింది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ఫేస్బుక్ ద్వారా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొంది.
ఇది చదవండి : అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమా.. ఎప్పుడంటే!
ఈ సందర్భంగా కవలల తల్లి ఫాతిమా మాడ్రిగల్ మాట్లాడుతూ.. తన కవల పిల్లలు ప్రత్యేక తేదీల్లో జన్మించడంపై తల్లిగా ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన ట్విన్స్ వేర్వేరు పుట్టినరోజులు కలిగి ఉండటం క్రేజీగా ఉందని, మగ శిశువుకు ఆల్ఫ్రెడో అని, పాపకు అలీన్ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు.