ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్ యుగం. అందుకే ఈ కాలం పిల్లలు అంతే స్మార్ట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం పిల్లలు నెలల వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెడుతున్నారు. ఫోన్ చేతికిచ్చి.. వారికి నచ్చిన వీడియోలు, గేమ్ లు పెడితే తప్ప తినడం లేదంటే ఎంతలా వీటికి అడిక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లలు ఇలా స్మార్ట్ ఫోన్ ఇవ్వడం వారి ఆరోగ్యానికి ప్రమాదం అని.. పెరుగుదలపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటితో పాటు మరో రకం తలనొప్పులు కూడా ఉంటాయి. అదేంటో తెలియాలంటే ఇది చదవండి.
ఆడుకునేందుకు తల్లి ఫోన్ తీసుకున్న ఓ చిన్నారి.. తనకు తెలియకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసి.. రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేశాడు. ఇంటికి డెలివరీ వచ్చిన వస్తువులు చూసి ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది. ఆరా తీయగా తమ చిన్నారి చేసిన పని గురించి వారికి తెలిసింది. అమెరికా, న్యూజెర్సీలో ఉంటున్న ఎన్నారై దంపతులకు ఈ అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : 19 ఏళ్లకే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసిన యువతి
న్యూజెర్సీలో ఉంటున్న ప్రమోద్ కుమార్ కుటుంబం ఇటీవల ఇల్లు మారారు. కొత్త ఇంటిలోకి అవసరమైన గృహోపకారణాలను కొనేందుకు మధుమతి కుమార్, ఆన్‌లైన్ యాప్ ద్వారా కావాల్సిన వస్తువులను వెతికి.. కార్ట్ లోకి యాడ్ చేసి పెట్టుకుంది. పనులన్నీ అయ్యాక కావాల్సిన వస్తువులను కొనుక్కోవచ్చులే అనుకుని ఫోన్ పక్కన పెట్టింది. అయితే తాను ఆన్‌లైన్ కార్ట్ లో యాడ్ చేసిపెట్టిన ఒక్కో వస్తువు, ఇంటికి వస్తుండడంతో ఆశ్చర్యపోయిన మధు కుమార్.. తన భర్త ఆర్డర్ చేసి ఉంటాడేమోనని అడిగింది. తానేమి ఆర్డర్ చేయలేదని భర్త బదులివ్వడంతో తన ఇద్దరు పిల్లలను అడిగింది. వారు కూడా ఏమి ఆర్డర్ చేయలేదని చెప్పడంతో.. ఇక ఇది తమ రెండేళ్ల కుమారుడు ఆయాన్ష్ పనే అయివుంటుందని గ్రహించింది.
ఇంటికి చేరుకున్న వస్తువులను వెనక్కు ఇచ్చేందుకు సదరు సంస్థకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా, అందుకు ఒప్పుకున్న సంస్థ సభ్యులు వస్తువులన్నీ తీసుకుని పూర్తి డబ్బు వాపసు చేస్తామని హామీ ఇచ్చారట. అయితే తమ ముద్దుల కొడుకు తెలిసీతెలియక చేసిన చిలిపి పనికి గుర్తుగా కొన్ని వస్తువులను ఉంచుకుని మిగిలినవి రిటర్న్ చేస్తామని చెప్పుకొచ్చారు ప్రమోద్ కుమార్ దంపతులు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు స్పందిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.