ప్రపంచదేశాలను ఓవైపు కరోనా వైరస్ వణికిస్తుంటే.. మరోవైపు వింత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ పాకిస్తాన్ దేశంలో కరోనా కంటే భయంకరంగా ఓ మహమ్మారి వ్యాప్తి చెందుతూ పసిపిల్లలను బలి తీసుకుంటుంది. ఆ వింత వ్యాధి ఏదో కాదు.. న్యుమోనియా. పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో న్యుమోనియా వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకి వందలాది చిన్నారులు న్యుమోనియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ ఒక్క ఏడాదిలోనే ఇంతవరకు న్యుమోనియా బారినపడి 7,462 మంది పిల్లలు మరణించినట్లు సింధ్ ఆరోగ్యశాఖ తెలిపింది. అంతేగాక 5 ఏళ్లలోపు వయసున్న 27,136 మంది పిల్లలు ఈ వ్యాధి కారణంగా ఆసుపత్రులపాలయ్యారని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. సింధ్ ప్రాంతంలోని గ్రామాలలో పిల్లలతో పాటు పెద్దలు సైతం న్యుమోనియా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. దాదాపుగా ఇప్పటివరకు 60% కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ప్రావిన్స్ పట్టణ ప్రాంతంలో 40% కేసులు నమోదయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి : దేశంలో అలజడి సృష్టిస్తున్న ఒమిక్రాన్!
ప్రాణాంతక న్యుమోనియా వైరస్ గురించి UNICEF తెలిపిన వివరాల ప్రకారం.. న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకితే చిన్నారుల ఊపిరితిత్తులలో చీము, నీరు నిండిపోతాయి. అందువలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి చనిపోతుంటారు. WHO నివేదికల ప్రకారం.. దాదాపుగా మొత్తం పిల్లల మరణాలలో 16 శాతం న్యుమోనియా వ్యాధి వల్లనే మరణిస్తున్నారని వెల్లడించింది.
మరి న్యుమోనియా లక్షణాలు ఏంటి?
అంటే.. సామాన్యంగా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఊపిరితిత్తులలో వాపు ఏర్పడుతుంది. దానినే న్యుమోనియా అంటారు. ఆ టైంలో కరోనా మహమ్మారి సోకితే.. ఊపిరి తిత్తులపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పిల్లలతో పాటు పెద్దలకు కూడా న్యుమోనియా ప్రాణాంతకంగా మారిందని నిపుణుల బృందాలు చెబుతున్నాయి.