వచ్చే ఏడాది నాటికి దేశంలో 30 లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఎసరు తప్పదని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికిపైగా పనిచేస్తుండగా 2022 నాటికి 30 లక్షల మందిని తగ్గించుకోవాలని సంస్థలు భావిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఫలితంగా ఏడాదికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని తెలిపింది. భారత్ అవసరాల కోసం పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి సరాసరి వార్షిక వేతనం 25,000 డాలర్లు, అమెరికా అవసరాల కోసం పనిచేస్తున్న వారికి 50,000 డాలర్ల మేర చెల్లిస్తున్నారు. తొలగించాలని భావిస్తున్న వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాలు, ఇతర వ్యయాల కోసం సుమారు రూ.7.5 లక్షల కోట్ల మేర కార్పొరేట్ సంస్థలు ఆదా చేసుకోవాలని చూస్తున్నాయని నివేదిక వివరించింది.
ఉద్యోగాలు తగ్గడం వరుసగా ఇది మూడో నెల. ఈ మూడు నెలల్లో మొత్తం 86 లక్షల ఉద్యోగాల నష్టం జరిగింది. గత ఏడాది కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 1.26 కోట్ల మంది వేతన జీవులు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో కోతకు యాంత్రీకరణే కారణమని వివరించింది. ఐటీ రంగంలో పనిచేస్తున్న 1.6 కోట్ల మందిలో 90 లక్షల మంది సేవలు, బీపీవో ఉద్యోగాల్లో పనిచేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. వీరిలో 30 శాతం మంది 2022 నాటికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.
రోబో ప్రాసెస్ ఆటోమేషన్ ప్రభావంతో అమెరికాలో 10 లక్షలు, భారత్‌లో ఏడు లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రభావం ఉందని పేర్కొంది. ఇక ఉద్యోగులను తగ్గించుకోవాలనుకుంటున్న సంస్థల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఉన్నాయి. కరోనా సెకెండ్ వేవ్ వ్యాప్తి దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు అడ్డుకట్ట వేసింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు దోహదపడగలిగే కొత్త పెట్టుబడులు ఈ ఏడాది కూడా వాయిదా పడవచ్చు.