వర్షం.. మనిషి మనుగడకు.. ప్రాణికోటికి జీవనాధారం. వాన చినుకు పుడమి తల్లిని ముద్దాడకపోతే.. మానవ జాతి క్షీణిస్తుంది. మనుషులకే కాక సకల ప్రాణి కోటి గొంతు తడుపుకుని.. ప్రాణం నిలబెట్టుకోలగుతున్నాడు అంటే అందుకు వర్షమే కారణం. అలాంటి వర్షం ఎక్కువ కురిసినా.. అసలు కురవకపోయినా.. మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఒక్క ఏడాది సరైన వానలు లేకపోతేనే తాగు నీటికి అల్లాడి పోతాం. అలాంటిది.. సుమారు 20 లక్షల ఏళ్లుగా వర్షం కురవలేదు.. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది.. అసలు అక్కడ ఎవరైనా జీవిస్తున్నారా వంటి వివరాలు తెలియాలంటే..
ఈ కరువు ప్రాంతం ఏడాదంతా మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికా ఖండంలో ఉంది. అత్యంత శీతలంగా ఉండే ఈ ఖండంలో.. ఉత్తరం వైపు సముద్ర తీరానికి సమీపంలో భూమ్మీద అత్యంత పోడిగా ఉండే ప్రదేశాలు ఉన్నాయి. వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఈ ప్రదేశాలను ‘డ్రై వ్యాలీస్’ అంటారు. ఇక్కడ సుమారు 20 లక్షల ఏళ్లుగా వాన పడటం గానీ.. మంచు కురవడం గానీ జరగలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రాంతంలో చాలా వరకు ఒక్క చుక్క నీరు గానీ.. కనీసం మంచు గానీ లేకుండా అత్యంత పొడిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏడాది పొడవునా.. మైనస్ 14-30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టించే చలి ఉంటుంది.మంచు ఖండమైన అంటార్కికాలో ఇలాంటి ప్రాంతాలు ఉండటానికి ప్రధాన కారణం అక్కడ వీచే ‘కాటబాటిక్స్ విండ్స్’ అనే గాలులు అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా డ్రై వ్యాలీస్ వైపు వీచే గాలులను.. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ట్రాన్స్ అట్లాంటిక్ పర్వతాలు అడ్డుకుంటాయి. దాంతో .. అవి మరింత పైకి వెళ్లిపోతాయి. అక్కడ ఉండే అతి తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఈ గాలుల్లోని తేమ అంతా మంచుగా మారి పర్వతాలపై పడిపోతుంది. ఏమాత్రం తేమలేని పొడి గాలులు.. డ్రైవ్యాలీస్ వైపు ప్రయాణిస్తాయి. వీటినే కాటబాటిక్ విండ్ అంటారు. ఇలా గాలిలో తేమ లేకపోవడంతో వానలు, మంచు కురవడం వంటివి అసలే ఉండవు. ఇక పూర్తిగా మంచినీటి మంచు ఖండంలో ఉప్పు నీటి సరస్సులు ఉండటం కూడా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడి సరస్సుల్లో నీళ్లు.. సముద్రపు నీటి కన్నామూడు రెట్లు ఉప్పుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
సమీపంలోని సముద్రం నుంచో.. మధ్యలోని సరస్సుల నుంచో డ్రైవ్యాలీస్ లోకి వచ్చిన సీల్ జంతువులు.. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక చనిపోతాయి. ఇలా మరణించిన వాటి శరీరాలు.. వందల, వేల ఏళ్లపాటు.. ఎక్కువగా కుళ్లిపోకుండా.. మమ్మీల్లా ఉండిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కనీరు లేని పరిస్థితులు, తీవ్రమైన చలి, ఉప్పునీరు వంటివి దీనికి కారణమని తేల్చారు.
రెండోస్థానంలో అటకామా ఎడారిఅంటార్కిటికాలోని డ్రైవ్యాలీస్‌ను మినహాయిస్తే.. భూమ్మీద అత్యంత పొడిగా ఉండే ప్రాంతం అటకామా ఎడారి. చిలీ, పెరూ దేశాల మధ్య ఉన్న ఈ ఎడారిలో ఏళ్ల పాటు ఒక్క చుక్క వాన కూడా పడదు. ఒకవేళ పడినా ఏడాదికి ఒకట్రెండు మిల్లీమీటర్ల కంటే తక్కువే పడుతుంది. మన దగ్గర ఒకట్రెండు నిమిషాల పాటు కురిసే వానకంటే కూడా అది చాలా తక్కువ.