తమిళనాడు- సాధారనంగా విమానం, హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు, అందుకు గల కారణాలను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే అంత ఎత్తునుంచి కూలిపోవడమో, లేదంటే కాలిపోవడమో జరుగుతుంటుంది కాబట్టి ప్రమాదానికి దారితీసిన ఆధారాలు ఏమాత్రం దొరకవు. కానీ విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు అతి కీలకమైనది బ్లాక్ బాక్స్. ఇదిగో ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా బ్లాక్ బాక్స్ కీలకం కానుంది.
తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 12 మంది ఆర్మీ అధికారులు ఉన్నారు. అయితే వీరీలో బిపిన్ రావత్ తో సహా 13 మంది చనిపోయారు. ఒక్క కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రగాయాలతో బయటపడి, ప్రస్తం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.
బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విమానాలు, హెలికాప్టర్ లో ఉపయోగించే బ్లాక్‌బాక్స్‌ను ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తారు. ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా, స్థిరంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా అందులోని డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో బ్లాక్ బాక్స్ ను రూపొందిస్తారు.
విమానాల్లో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి. ఒకదాన్ని ఫ్లైట్ జెట్ రికార్డర్ గా పిలుస్తారు. ఇందులో విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది, ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఎంత వేగంగా ప్రయాణిస్తుంది లాంటి సమాచారం రికార్డ్ అవుతుంటుంది. రెండవది కాక్ పిట్ రికార్డర్. అంటే విమానం నడిపే పైలెట్ తన సహ పైలెట్‌తో మాట్లాడే మాటలను, గ్రౌండ్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడే మాటలను రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ అనేది విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.
ఇక ఈ బ్లాక్ బాక్స్ విమానం వెనక భాగంలో అమర్చి ఉంటుంది. ఎందుకంటే ప్రమాదానికి గురైనా విమానం వెనుక భాగం తక్కువగా ద్వంసం అవుతుంది. ఇక్కడ ఆసక్తిరమైన అంశం ఏటంటే.. బ్లాక్ బాక్స్ అంటే నల్ల రంగులో ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ బ్లాక్ బాక్స్ ముదురు నారింజ రంగులో ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ బాక్స్‌ను సులభంగా గుర్తించడానికి ఈ రంగును వాడతారు. ఐతే విమాన ప్రమాద సమయానికి రెండు గంటల ముందు డాటా మాత్రమే ఇందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ హెలికాప్టర్ కు సంబందించిన బ్లాక్ బాక్స్ దొరికితే, ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.