స్పోర్ట్స్ డెస్క్- మొన్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే ఒక్క బంగారు పతకం రావడం కొంత నిరాశపరిచింది. మరిన్ని గోల్డ్ మెడల్స్ రావాల్సిందని క్రీడాభిమానులంతా అనుకున్నారు. కానీ నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పతకం సాధించగా, భారత్ కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇక ఒలింపిక్స్ తరువాత ఇప్పుడు టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో కూడా భారక క్రీడాకారులు అధ్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు.
టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్ మరో ఘనత సాధించింది. ఈసారి ఏకంగా బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ అవనీ లేఖరా మంచి అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఫైనల్‌లో విజయం సాధించి, భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.
ఫైనల్‌లో భారత షూటర్ అవనీ లేఖరా 249.6 రికార్డు స్కోరుతో బంగారు పతకం దక్కించుకోగా, చైనాకు చెందిన కుయ్‌పింగ్ ఝాంగ్ 248.9 స్కోరుతో రజత పతకాన్ని సాధించింది. ఉక్రెయిన్‌కి చెందిన ఇరినా షెత్నిక్ 227.5 స్కోరుతో తో కాంస్య పతకం అందుకుంది. ఇక పారాఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్న మొదటి భారతీయురాలిగా అవనీ లేఖరా రికార్డ్ సృష్టించింది.
భారత షూటర్ అవనీ లేఖరా పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 5వరకు టోక్యో పారా ఒలింపిక్స్ జరగనున్నాయి. పారా ఒలింపిక్స్ లో భారత్ కు మరిన్ని పతకాలు రావాలని కోరుకుందాం.