హైదరాబాద్- ఒకప్పుడు ఇళ్లల్లోకి, బ్యాంకుల్లోకి వచ్చి దోపిడి చేసేవారు దొంగలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరితో సంబంధం లేకుండా, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో, విదేశాల్లో ఉంటూనే దోచుకుంటున్నారు. దీన్నే సైబర్ దోపిడి అంటున్నాం. అవును గత కొన్నాళ్లుగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇక మన హైదరాబాద్ లో సైబర్ నేరాలు అంతకంతకు పెరిగుతున్నాయి. తెలంగాణ సైబర్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల అమాయకత్వం కారణంగా సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో దోచుకుంటూనే ఉన్నారు. జనంలో ఉన్న అత్యాశ, అమాయకత్వం, నమ్మకమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసపాలకు పాల్పడుతున్నారు.
సైబర్ మోసగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు మరుగునపడిపోతున్నాయి. సైబర్ మోసాల్లో సగానికి సగం పోలీసులకు వరకు రావడం లేదని, వచ్చినా అందులో సగం వరకు పరిష్కారం కావడం లేదని లెక్కలు చెబుతున్నాయి. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతే డబ్బులు తిరిగి రావడం అసాధ్యమనే చెప్పొచ్చు.
హైదరాబాదీలు ఇలా ఆరేళ్లలో సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఎంత డబ్బు కోల్పోయారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఆరేళ్లల్లో అక్షరాల 4611 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. 2015–2020 మధ్య ఆరేళ్ల కాలంలో 9,101 మోసాల కేసుల్లో హైదరాబాద్ వాసులు కోల్పోయింది అక్షరాలా 4వేల 6 వందల 11 కోట్ల 40 లక్షల రూపాయలు. ఈ లెక్కలు చూసైనా సైబర్ నేరగాళ్ల చేతిలో చిత్తైపోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.