ఆ గ్రామంలో దుండగుల దుశ్చర్య గ్రామస్థులను కలవరపెట్టింది. గుర్తుతెలియని వ్యక్తులు సమాధిని తవ్వి ఓ మహిళ పుర్రెను అపహరించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ శివారులో జరిగింది. అదే గ్రామానికి చెందిన ఏలిశా బెతూ అనే మహిళ ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆమె మూడేళ్ల క్రితం మరణించగా గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించి.. సమాధి చేశారు. జనవరి 6న ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ సమాధాని ధ్వంసం చేశారు.
సమాధిని తవ్వి అందులోని ఎముకలు, పుర్రెను అపహరించారు. అది గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలంలో ఆధారాలు దొరక్కుండా చేశారు. అంతేకాకుండ పోలీసు జాగిలాలు వాసన చూసేందుకు వీలు కాకుండా కారంపొడి చల్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఎందుకు అలా చేశారు అనేది విచారణలో తేలాల్సి ఉంది. గ్రామస్థుల్లో కొందరు క్షుద్రపూజల కోసమే అలా చేశారంటూ భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలకలం రేపింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.