పోలీసులు అంటే ప్రజల సేవకులు-రక్షకులు.. ఈ విషయం అందరికీ తెలుసు. ఆ యూనిఫారమ్ వేసుకునే వాళ్లకు కూడా స్పష్టంగా తెలుసు. కానీ, కొంతమంది పోలీసు అంటే రక్షకులు కాదు.. భక్షకులు అనే అభిప్రాయం ఏర్పడేలా ప్రవర్తిస్తుంటారు. సామాన్యూలపై విరుచుకుపడటం.. వారి ప్రతాపం చూపించడం చాలా సందర్భాల్లో చూశాం. ఎంత తప్పు చేసినా సామాన్యులపై భౌతికంగా దాడి చేసే హక్కు, అవకాశం పోలీసులకు లేదు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ట్రాఫిక్ కానిస్టేబుల్ రూల్స్ గాలికి వదిలేసి.. కాలికి పని చెప్పాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వృద్ధుడిని కాలితో తంతూ నానా వీరంగం సృష్టించాడు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి అన్నమయ్య సర్కిల్ లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రద్దీగా రోడ్డులోకి ఓ సిమెంట్ లోడు లారీ వచ్చింది. రోడ్డుకు పక్కన ఆ లారీని పార్క్ చేయగా.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని కానిస్టేబుల్ కిషోర్ నాయుడు వచ్చి లారీ తీయాలంటూ చెప్పాడు. అందుకు సింమెంట్ లారీలో ఉన్న వ్యక్తి(మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానం) ఏం కాదులే ఇక్కడే ఉంచుతా అంటూ చెప్పుకొచ్చాడు.
వారి మధ్య మాటామాట పెరగడంతో ఆ వ్యక్తి ఆగ్రహంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను తోసేశాడు. ఆ చర్యతో కిషోర్ నాయుడు కోపం కట్టలు తెంచుకుంది. వయసులో పెద్దవాడు అని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా కొట్టడం మొదలు పెట్టాడు. అందరూ చూస్తున్నారని కూడా లేకుండా ఎగిరెగిరి అతనిపై దాడి చేశాడు. ఆ ఘటనను మొత్తం అక్కడున్న స్థానికులు కెమెరాల్లో వీడియో తీశారు.
లారీ వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందనుకున్నప్పుడు.. చట్టపరంగా చర్యలు తీసుకోనుండాల్సింది. పరిస్థితి చేయి దాటిపోతోంది.. మద్యం మత్తులో అతను దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నప్పుడు స్థానిక పోలీసుల సహాయం తీసుకుని అతడిని తాత్కాలికంగా అరెస్ట్ చేయించాల్సింది. అంతేకానీ, సామాన్యులను అలా నడిరోడ్డుపై తన్నడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.